
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అర్జీదారుల సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు సమస్యలను అర్జీరూపంలో అందజేయాలని కలెక్టర్ సూచించారు.
ఎస్వీయూ అధికారుల అత్యుత్సాహం
తిరుపతి సిటీ : ఎస్వీయూలో అధికారుల అత్యుత్సాహం మితిమీరుతోంది. నిబంధలకు విరుద్ధంగా నోటిఫికేషన్ సైతం విడుదల చేయకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపడుతున్నారు. అందులో భాగంగా వర్సిటీలోని గ్రంథాలయం, ఎస్వీ క్యాంపస్ స్కూల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో కాంట్రాక్ట్ బేసిస్ అంటూ నియామకాలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ. 22వేలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా, నూతనంగా నియమించిన వారికి రూ. 25వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే పలు విభాగాలల్లో నాన్ టీచింగ్ నియామకాలపై దృష్టి సారించి ఒక్కో పోస్టుకు రూ.లక్షలు దండుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు కూటమి నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇద్దరు అధ్యాపకులపై వేటు
వర్సిటీలోని ఎంబీఏ, ఎంసీఏ విభాగాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులను విధుల నుంచి తప్పించారు. సక్రమంగా పనిచేయకపోవడం, విధులకు రెగ్యులర్‌గా హాజరుకాకపోవడంతో వేటు వేసినట్లు తెలిసింది.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు గోగర్భం డ్యామ్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 83,380 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,275 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
సూర్యభగవానుడికి
ప్రత్యేక పూజలు
ఏర్పేడు : మండలంలోని గుడిమల్లంలో వెలసిన ఆనందవళ్లీ సమేత పరశురామేశ్వరాలయంలో ఆదివారం సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు ఆకుల సతీష్, గౌతమి, తీర్థప్రసాద్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈఓ రామచంద్రారెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గిరినాయుడు, అర్చకులు వంశీకృష్ణ, పవన్‌కుమార్ శర్మ పాల్గొన్నారు.