
ఉత్తుత్తి విద్యుత్
నేత కార్మికులకు అందని ఉచిత విద్యుత్ 93 వేల చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు 10,534 పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్లు కేవలం ప్రకటనలకే పరిమితమైన హామీ అమలుకు మీనమేషాలు లెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం
నేతన్నకు
●
నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఆరు నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్‌లూమ్స్‌కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. సర్కారు కొలువు దీరి ఏడాదిన్నర కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంతో నేత కార్మికులు మండిపడుతున్నారు. హామీ అమలు చేయాలంటూ ఆందోళనబాట పడుతున్నారు.
పుత్తూరు : ఉచిత విద్యుత్ జీఓతో తమ కుటుంబాలకు కొంతైనా ఆర్థిక భారం తగ్గుతుందనుకున్న నేతన్న జీవితాల్లో నిరాశే మిగిలింది. వ్యవసాయం తర్వాత చేనేత రంగం అతిపెద్ద ఉపాధి రంగం. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. లయబద్దంగా వినబడే పవర్‌లూమ్స్ ధ్వని వినిపించడం తగ్గిపోతోంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణం. చాలీ చాలని కూలీలతో జీవితాలు అప్పుల పాలవుతున్నాయని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దాదాపు అన్ని పవర్‌లూమ్ కేంద్రాలు మూతపడే పరిస్థితిలోకి వెళ్తున్నాయి. గత మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీవో నంబర్ 44 ఆరు నెలలు పూర్తయినా అమలు కాకపోవడంతో నేతన్నలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
నేతన్న నేస్తంతో ఆదుకున్న
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతే కాకుండా విద్యుత్ చార్జీల నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో నారా చంద్రబాబు నాయుడు పుత్తూరులో పర్యటించారు. ఆ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. చేనేత, పవర్‌లూమ్స్ కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాల పేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మికుల నడ్డి విరిచారు.
జీవో అమలులో నిర్లక్ష్యం
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చాలంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 26వ తేదీన జీవో 44ను విడుదల చేసింది. ఇందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్య, పవర్‌లూమ్ యూనిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపిస్తూ జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2,79,000 వేల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరమగ్గాలు 81 వేలు ఉండగా కేవలం 10,534 ఉన్నట్టుగా చూపించారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. ఇందుకు ఏడాదికి సుమారు రూ.125 కోట్ల ఆర్థిక భారం పడనున్నదని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కమ్ సంస్థలు ఇంధన శాఖకు తగిన బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించారు. అయితే జీవో విడుదలై 6 నెలలు కావస్తున్నా బడ్జెట్ విడుదల కాకపోవడంతో నేటికీ జీవో అమలుకు నోచుకోలేదు.
నేతన్నల డిమాండ్లు
జీవో నంబర్ 44ను వెంటనే అమలు చేయాలి
మొత్తం రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 శాతం 3,000 కోట్లు కేటాయించాలి
నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి
చేనేత వస్త్ర ఉత్పత్తులకు జీరో జీఎస్టీని వర్తింపచేయాలి
నూలు, సిల్క్‌లకు 50 శాతం రాయితీ ఇవ్వాలి
చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి
గృహం, వర్క్ షెడ్ పథకాన్ని అమలు చేయాలి
జీవిత బీమా సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన బీమా పథకాన్ని కొనసాగించాలి
సహకార సంఘాలను బలోపేతం చేయాలి

ఉత్తుత్తి విద్యుత్