
స్విమ్స్‌లో ‘నిరంతర వైద్య విద్య’
తిరుపతి తుడా : స్విమ్స్ ఆస్పత్రిలోని అనస్తీషియా, కార్డియాలజీ, సిటీ సర్జరీ విభాగాల ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్న్ఙి శనివారం నిర్వహించారు. పద్మావతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రత్యేక సదస్సుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కార్డియాలజీ, సీటీ స్కాన్, సర్జరీ, ఆనస్తీషియా తదితర విభాగాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వనజాక్షమ్మ, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ అలో సమంతరే, డాక్టర్ రోహిత్ కుమార్, డాక్టర్ వహీద్ ఖాన్, డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
తెలుగు గంగ కాలువలో దూకి వ్యక్తి మృతి
కలువాయి (సైదాపురం) : మండలంలోని చింతలాత్మకూరు గ్రామానికి చెందిన నాగిళ్ల రవి(30) పర్లకొండ సమీపంలోని తెలుగు గంగ కాలువలోకి దూకేశాడని స్థానికులు తెలిపారు. శనివారం దాచూరు సమీపంలోని కండలేరు డ్యామ్ నందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ కోటయ్య వెళ్లి సమగ్ర విచారణ చేపట్టారు. గంగ కాలువలోకి దూకిన రవికి మతిస్థిమితం సరిగా లేదని మృతుడు రవి తల్లిదండ్రులు వివరించారని పోలీసులు తెలియజేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పాకాల : మండలంలోని దామలచెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. వివరాలు.. మ్యాంగోనగర్ క్రాస్ నుంచి రైల్వేస్టేషన్ వెళ్లే దారిలోని మద్యం దుకాణం సమీపంలో సుమారు 60 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్విమ్స్‌లో ‘నిరంతర వైద్య విద్య’