
నష్టాలనిమ్మ
చిల్లకూరు : నిమ్మ ధరలు పతనం అవుతుండడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడేమో వేసవిని తలపించేలా ఎండలు మండిపోతుండడం, ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఢిల్లీ మార్కెట్‌లో వ్యాపారులు నిమ్మ కాయలు వద్దంటున్నారని ఇక్కడ వ్యాపారులు రైతుల నుంచి కిలో నిమ్మ కాయలు రూ. 40 లోపే కొనుగోలు చేస్తున్నారు. సహజంగానే చలికాలం నిమ్మ కాయలకు కొంత డిమాండ్ ఉండదు. అయితే దీన్నే ఆసరాగా చేసుకొని వ్యాపారులు సిండికేట్‌గా మారి నిమ్మ రైతుల పొట్టుకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ మార్పులతో..
ఈ ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ చిన్నపాటి వర్షాలు కొంత మేర పడడంతో నిమ్మ చెట్టుకు బలం వచ్చింది. దీంతో పూత పూసి కాపునకు వచ్చాయి. దిగుబడి బాగా పెరిగింది. అయితే మార్కెట్‌లో ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో రైతులు కొంత మంది కూలీలను పెట్టి కోయించే పరిస్థితి లేక అలాగే వదిలేస్తున్నారు.
నరికేస్తున్న రైతులు
నిమ్మ ఒక్కసారి నాటితే కనీసం 30 ఏళ్ల వరకు కాపు కాస్తూనే ఉంటాయి. వయస్సు పడ్డ చెట్లు దిగుబడి ఎక్కువగా ఇవ్వకపోవడంతో రైతులు వాటిని నరికి వేస్తున్నారు. ఎక్కువ శాతం మంది సైదాపురం ప్రాంతాలలో నిమ్మ చెట్లు నరికేసి సరుగుడు మొక్కల సాగుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఏడాది సుమారు 200 ఎకరాల వరకు రైతులు చెట్లు నరికేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం రాపూరు, సైదాపురం, డక్కిలి , బాలాయపల్లి మండలాల్లో చెట్లు నరికేసినట్లు తెలుస్తోంది.
జ్యూస్ పరిశ్రమలు లేకపోవడంతో..
నిమ్మ రసంతో తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు ముడి సరుకును అందించేలా రసం నిల్వ చేసే సిట్రస్ పరిశ్రమలు అందుబాటులో లేకపోవడంతో పూర్తి స్థాయిలో నిమ్మ పంట మొత్తంగా ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాల కొనుగోళ్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. అదే జ్యూస్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే వారికి నిమ్మ కాయలను ఏడాది పొడవునా రైతులు సరఫరా చేసి మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది.
ఎగుమతులు జరిగే ప్రాంతాలు
నిమ్మ మార్కెట్ బాగా ఉండే సమయంలో గుజరాత్, పూణే, ముంబయి, బెంగుళూరు, చైన్నె, కోలకత్తా, సూరత్, ఢిల్లీ మార్కెట్‌కు ప్రతి రోజు కనీసం రెండు లారీలు (ఒక లారీ 22 టన్నులు) ఎగుమతులు జరిగేవి. నేడు ధరలు లేకపోవడంతో రైతులు మార్కెట్‌కు కాయలు తీసుకొచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు.

నష్టాలనిమ్మ