ఎస్వీయూకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్వీయూకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌

Sep 5 2025 4:54 AM | Updated on Sep 5 2025 4:54 AM

ఎస్వీయూకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌

ఎస్వీయూకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌

తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)కు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌ (ఐఎస్‌ఓ) గుర్తింపు లభించింది. గురువారం ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో ఐఎస్‌ఓ బృందం వీసీ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడుకు ధ్రువపత్రాలను అందజేసింది. విద్యా నైపుణ్యం, స్థిరత్వం, సమగ్రాభివృద్ధి, నిబద్ధత వంటి అంశాలపై ప్రగతి సాధించిన వర్సిటీగా అంతర్జాతీయ గుర్తింపు పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించిందని వర్సిటీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. వర్సిటీ ఈ స్థాయికి చేరుకోవడంలో బోధన, బోధనేతర సిబ్బంది కృషి ఎనలేనిదని కొనియాడారు. పర్యావరణ ప్రోత్సాహకంలో ఐఎస్‌ఓ 14001, ఇంధన పొదుపు పద్ధతుల నిర్వహణలో ఐఎస్‌ఓ 50001, నాణ్యమైన విద్యాసేవలకు ఐఎస్‌ఓ 21001, అతిథి సేవలు, ఆహార భద్రత విషయంలో ఐఎస్‌ఓ 22000 గుర్తింపు లభించిందని వర్సిటీ అధికారులు తెలిపారు.

అధ్యాపకులే దేశ నిర్మాతలు

తిరుపతి సిటీ : అధ్యాపకులు దేశ నిర్మాతలని, వారే దేశ సంపదని ఎన్‌ఎస్‌యూ వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో గురువారం సాంకేతిక విద్యతో విద్యావ్యవస్థ బలోపేతం అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు గురువారం ముగిసింది. అనంతరం ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ–క్రాప్‌ నమోదులో వెనుకబాటు

తిరుపతి అర్బన్‌ : ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్‌ నమోదు చేయడంలో బాగా వెనుకబడి ఉన్నారని, వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ జిల్లా అధికారి ప్రసాద్‌రావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, జిల్లా పశువైద్యాధికారి రవికుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డివిజన్‌, మండలాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 13.48 లక్షల సర్వే నంబర్లకు చెందిన భూముల్లో ఈ–క్రాప్‌ నమోదు చేయాల్సి ఉందని చెప్పారు. పంట సాగు చేసి ఉంటే చేశారని, చేయకుంటే చేయలేదని వివరాలతో పాటు పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. జూలై 15 నుంచి ఈ–క్రాప్‌ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 1.72 లక్షల సర్వే నంబర్లకు చెందిన భూముల్లో మాత్రమే ఈ–క్రాప్‌ పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన 11.76 లక్షల సర్వే నంబర్లలో ఈ–క్రాప్‌ను ఈనెల 30 లోపు పూర్తి చేయాలని వెల్లడించారు. కేవలం 25 రోజుల గడువు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని పూర్తిగా రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో చేపట్టాలని వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం సాగును మరింత విస్తరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో 291 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేసినప్పటికీ, కొత్తగా మరో 726 పంచాయతీలను ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఒక్కో పంచాయితీలో 125 మంది రైతులతో 50 హెక్టార్లల్లో ప్రకృతి వ్యవసాయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, మైక్రో ఇరిగేషన్‌ జిల్లా అధికారి సతీష్‌, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్‌ షణ్ముగం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement