
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
కలువాయి (సైదాపురం) : మండలంలోని వెంకటరెడ్డిపల్లి నేషనల్ హైవే ఆనుకొని జంక్షన్ వద్ద రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొందరు కూటమి నేతలు దర్జాగా కబ్జా చేశారు. కళ్ల ముందు ఫారెస్టు భూమి నుంచి అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్నా అటవీ అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నా.. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నా.. ఫారెస్టు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
రూ.30 లక్షల విలువైన ప్రభుత్వ భూమి
ప్రభుత్వ భూములను కూటమి నాయకులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఇటీవల కోటూరుపల్లి ప్రభుత్వ భూమి ఆక్రమించిన విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తాజాగా నేషనల్ హైవే ఆనుకున్న ఉన్న భూమి ముందు ప్రభుత్వ భూమి అని, వెనుక పట్టా అని రెవెన్యూ అధికారులు కొత్త కథలు చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల చేతివాటంతో రూ.30 లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కూటమి నేతలు ఆక్రమిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం
నేషనల్ హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైవే జంక్షన్ వద్ద తూర్పు , పడమర 40 నుంచి 50 మీటర్లు విస్తీర్ణం కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఆ భూములకు నేషనల్ హైవే అథారిటీ పరిహారం ఇచ్చారు. ఆక్రమణదారులు దర్జాగా హైవే పక్కన భూములు ఆక్రమిస్తున్నా వీరికి తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై ఇన్‌చార్జి తహశీల్దార్ వెంకటేశ్వర్లు వివరణ ఇస్తూ..వెంకటరెడ్డిపల్లి జంక్షన్ వద్ద నేషనల్ హైవే ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 360 కొంత ప్రభుత్వ భూమి ఉన్న మాట వాస్తవమేన్నారు. ప్రభుత్వ భూమి వెనుక వైపు పట్టా భూమి అని తెలిపారు. ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. మరి అక్రమంగా మట్టి తోలుతున్న విషయంపై చర్యలపై అడగగా సమాధానం దాటవేశారు.