
శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుంచి పవిత్ర సమర్పణ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో ఆరాధన, హోమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్టి తదితర వైదిక కార్యక్రమాలను చేపట్టారు. ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మఖ మండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపట్టనున్నారు. అటు తర్వాత పలు వైదిక కార్యక్రమాల తర్వాత ఆదివారం చంద్రగ్రహణంలో భాగంగా మధ్యాహ్నం 02.15 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజు, ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్ రమేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.