డిగ్రీ డీలా! | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ డీలా!

Sep 7 2025 8:32 AM | Updated on Sep 7 2025 8:32 AM

డిగ్రీ డీలా!

డిగ్రీ డీలా!

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో ప్రవేశాలు అంతంతే ! ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 30 శాతం దాటని దరఖాస్తులు ఉన్నత విద్యామండలి నిర్వాహకమే కారణమంటున్న విద్యావేత్తలు టీటీడీ విద్యాసంస్థలపై మొగ్గుచూపిన విద్యార్థులు నేడు సీట్ల కేటాయింపు..రేపు కళాశాలలో రిపోర్టింగ్‌

తిరుపతి సిటీ : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో 2025–26కు సంబంధించి ప్రవేశాలు నాలుగు నెలలు జాప్యం కావడంతో అడ్మిషన్ల దరఖాస్తులు కనీసం 40 శాతం కూడా దాటకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యామండలి దరఖాస్తుల గడువును మూడుసార్లు పొడిగించినా దరఖాస్తులు పెరగకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది 50 శాతానికి పైగా ప్రవేశాలు తగ్గుముఖం పట్టనున్నట్లు స్పష్టమైన సంకేతాలు రావడంతో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల పరిస్థితి దారుణంగా తయారైంది.

రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందకపోవడంతో పాటు ఈ ఏడాది డిగ్రీలో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కళాశాలలను ఎలా నడపాలో అర్థం కావడం లేదంటూ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

టీటీడీ కళాశాలలపై తగ్గని ఆదరణ

డిగ్రీ ప్రవేశాల కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వైపు మొగ్గు చూపడం లేదు. జిల్లాలోని సుమారు 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీసం 30 శాతం దరఖాస్తులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్పీడబ్లూ, ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలల్లో 90 శాతానికి మించి దరఖాస్తులు రావడం గమనార్హం. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓరియెంటల్‌, సికింద్రాబాద్‌ కళాశాలలో 25 శాతం కూడా దరఖాస్తులు రాకపోవడంతో ఆయా కళాశాలల యాజమాన్యాల పరిస్థితి అయోమయానికి గురిచేస్తోంది.

నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం

జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నత విద్యామండలి నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సింగిల్‌, డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ విధానం అంటూ విద్యార్థులను తికమక పెట్టించి నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేయడం దారుణమని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా విధానాన్ని నిర్వీర్యం చేసిందని, కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ము కాసేందుకే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయాన్ని మేధావులు విద్యావంతులు తప్పుపడుతున్నారు.

రూ.కోట్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు

జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు ప్రైవేటు డిగ్రీ యాజమాన్యాలు కళాశాలలను నడపలేని పరిస్థితికి చేరుకున్నాయి. రెండేళ్లుగా జిల్లాలో సుమారు రూ.650 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో ఒక్కో కళాశాలకు సుమారు రూ.కోటి నుంచి 2 కోట్ల వరకు చెల్లించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో కళాశాలలను నడపలేని స్థితిలో యాజమాన్యాలు నరకయాతన పడుతున్నాయి. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పడనుంది. కనీసం 25శాతం సైతం అడ్మిషన్లు జరిగే పరిస్థితి లేదంటూ యాజమాన్యాలు వాపోతున్నాయి. డిగ్రీ ప్రైవేటు కళాశాల పరిస్థితి అయోమయంలో పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నేడు సీట్ల కేటాయింపు సంక్షిప్త సందేశాలు

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆదివారం విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ మేరకు ఓఏఎమ్‌డీసీ పోర్టల్‌ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల, మెరిట్‌ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం విద్యార్థుల మొబైల్‌ ఫోన్లకు సమాచారం అందించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో సోమవారం రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల

టీటీడీ విద్యాసంస్థల వివరాలు

కళాశాల అందుబాటులో వచ్చిన

ఉన్న సీట్లు దరఖాస్తులు

పద్మావతి మహిళా

డిగ్రీ కళాశాల 1550 1697

ఎస్‌జీఎస్‌

ఆర్ట్స్‌ కళాశాల 1068 1457

ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల 1417 1679

ఎస్వీ

ఓరియెంటల్‌ కళాశాల 300 189

సికింద్రాబాద్‌

ఎస్వీవీవీఎస్‌ 60 57

ఎప్పుడూ చూడలేదు..

గ్రామీణ పేద విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురు చూసిన డిగ్రీ అడ్మిషన్లు కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఇంటర్‌ ఫలితాలు విడుదల చేసి నాలుగు నుంచి 5 నెలలు గడిచినా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కళాశాలలో కనీసం 20శాతం సైతం ప్రవేశాలు జరిగే పరిస్థితి లేదు. తిరుపతి నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో మాత్రమే కాస్త మెరుగ్గా దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఏపీ చరిత్రలో డిగ్రీ అడ్మిషన్లపై ఇలాంటి పరిస్థితి చూడలేదు.

– ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ రిటైర్డ్‌ అధ్యాపకుడు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement