
గుజరాత్ యాత్రకు ప్రత్యేక రైలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీకి తొలిసారిగా పర్యాటక ప్రదేశాల సందర్శనార్థం 10 ప్రత్యేక రైళ్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్రను నిర్వహించనున్నట్లు తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు.
ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నదీ తీరం, యునెస్కో వారసత్వ స్థలం, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన యాత్రికులు సందర్శించే అవకాశం ఉంటుందన్నారు.
ఈ ప్రత్యేక పర్యాటక రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట జంక్షన్‌కు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులకు భోజనవసతి కల్పిస్తారన్నారు. స్లీపర్ ధర రూ. 18,400 కాగా 3 టైర్ ఏసీ ధర రూ. 30,200 కాగా 2టైర్ ఏసీ ధర రూ. 39,900గా నిర్ణయించినట్లు తెలిపారు. యాత్రికులు 92814 95853 , 82879 32313 నంబర్లను సంప్రదించాలని కోరారు.