
సిట్ విచారణకు అన్నివిధాలా సహకరించాం
తిరుపతి రూరల్: ‘‘సిట్ అధికారులు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పాను. విచారణకు అన్నివిధాలుగా సహకరించాం.. ఇప్పుడే కాదు.. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తాం. దయచేసి పత్రికలు, టీవీ చానెళ్లలో జరగనది జరిగినట్టు అవాస్తవాలు ప్రచురించకండి. రాజకీయాల్లో మా నాన్న ఇరవై ఏళ్లు ప్రజలకు మంచిచేసి తెచ్చుకున్న పేరును చెరపాలని చూసినపుడు బాధ కలుగుతోంది.. దయచేసి అర్థం చేసుకోండి’’ అంటూ తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. తుమ్మలగుంట గ్రామంలోని చెవిరెడ్డి ఇంటి వద్ద గురువారం జరిగిన సిట్, విజిలెన్స్ అధికారుల విచారణ ముగిసిన తరువాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్, విజిలెన్స్ అధికారులు బుధవారం తమ ఇంటికి వచ్చారని, వాళ్లు వస్తారన్న సమాచారం తమకు లేనందున ఆ సమయంలో ఇంటికి తాళం వేసుకుని తాము విజయవాడ కోర్టుకు వెళ్లామని చెప్పారు. గురువారం తాము ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే సిట్ అధికారులు వచ్చారని, సెర్చ్ ప్రాసెస్ పూర్తిచేసుకుని తనను విచారించారని తెలిపారు. సిట్ అధికారులు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పానని, విచారణకు అన్ని విధాలుగా సహకరించినట్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్పారు.
ఆయన అన్ని విధాలుగా సహకరించారు
సిట్ అధికారులతో కలిసి తాము చేసిన విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరించారని విచారణ అధికారులతో కలిసి వచ్చిన తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ మీడియాకు వివరించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని, వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకుని వెళుతున్నామని తెలిపారు.