
వంచనతోనే కూటమికి అధికారం
ఏడాదన్నర పాలనలో హామీల అమలు గాలికి జగనన్న పాలనలోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి
తిరుపతి మంగళం : ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన అబద్ధాలు గుప్పించి ప్రజలను మోసగించి, వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం తిరుపతి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాళ్లతో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితరెడ్డి సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడం కోసం చంద్రబాబు నోటికి వచ్చిన అబద్ధాలు గుప్పించి అధికారంలోకి రాగానే వాటిని తుంగల్లో తొక్కేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదన్నర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన పాపానపోలేదని మండిపడ్డారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసం, వంచన తప్ప ఏ ఒక్కరికి మంచి చేసిన చరిత్రలేదన్నారు. మోసంతో వంచించిన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి సంక్షేమ సారధి జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగీ అధికారంలోకి తీసుకురావడంతో మహిళలు కీలకంగా వ్యవహరిద్దామని కోరారు.
50 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలకు పదవులు
మేయర్ శిరీష మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి పురుషులకు సమానంగా హక్కులు, ఉన్నత పదవులను కల్పించిన గొప్ప నాయకులన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి కృషి చేసి ఉన్నత పదవులు కల్పించి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారని సగర్వంగా చెప్పారు.
భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారం కోసం ప్రజలను వంచించే తత్వం చంద్రబాబుదైతే, అధికారం లేకపోయినా పర్వాలేదు, ప్రజలకు అబద్దాలు చెప్పి మోసగించలేనన్న గొప్ప మనస్తత్వం కలిగిన నాయకుడు జగనన్న అన్నారు. కూటమి పాలనలో మహిళా సాధికారత అనేదే లేదన్నారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అంటూ మహిళలను మోసిగించిన ద్రోహి చంద్రబాబు అన్నారు. జగనన్న పాలనలోనే మహిళలకు ఉన్నత స్థానం లభించిందన్నారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుదామని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, జోనల్ ప్రెసిడెంట్ మెయిళ్ల గౌరీ, జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, నగర అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, కార్పొరేటర్లు ఆరణి సంధ్య, ఉమా అజయ్, బసవగీత, తిరుపతి నగర బూత్ కమిటీ ఇన్‌చార్జ్ ముప్పాల సాయికుమారి, పార్టీ మహిళలు పాల్గొన్నారు.
జగనన్న పాలనలోనే మహిళలకు ఉన్నత స్థానం
కక్షపూరిత రాజకీయాలతో అక్రమ కేసులు
పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరిత రాజకీయాలతో అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారే తప్ప ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదన్నారు. కూటమి అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ జగనన్నను తిరిగీ అధికారంలోకి తెచ్చుకోవడానికి మహిళలంతా ఒక్కటై వైఎస్సార్‌సీపీ బలోపేతానికి నిరంతరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు.

వంచనతోనే కూటమికి అధికారం

వంచనతోనే కూటమికి అధికారం

వంచనతోనే కూటమికి అధికారం