
ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుదాం
తిరుపతి మంగళం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుదామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి మారుతీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డితో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలను స్క్రీన్ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వజ్ర భాస్కర్‌రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌తో పాటు పార్టీ శ్రేణులు తిలకించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న సీఎంగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. రాష్ట్రంలో, పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ శ్రమిద్దామని పిలుపునిచ్చారు. వచ్చే నెల 5వతేదీకి పుంగనూరు నియోజకవర్గంలో అన్ని కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుదాం