
సభలకు రాకుంటే సంక్షేమ పథకాలు కట్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘గ్రూపు సభ్యులు తప్పకుండా చంద్రబాబు సభలకు రావాలి. రాకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కట్ అవుతాయి. పనులు కావాలంటే జరగవు. సార్లు నుంచి మాపై ఒత్తిళ్లు ఉన్నాయి. తప్పకుండా సభలకు రావాల్సిందే..’ అంటూ షోషల్ మీడియాలో ఓ ఆడియో చక్కర్లు కొట్టింది. శనివారం కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన జలహారతి కార్యక్రమానికి జనసమీకరణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు పడరానిపాట్లు పడ్డారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సుల్లో జనసమీకరణ చేపట్టారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాన్ని తరలించారు. ఈ బస్సుల్లో ప్రధానంగా వెలుగు గ్రూపు సభ్యులే ఎక్కువగా కనిపించడం గమనార్హం. పుంగనూరు, మదనపల్లి, చిత్తూరు, ఒంగోలు నుంచి జన సమీకరణ చేపట్టారు. ప్రతి బస్సు పైనా అధికార పార్టీ పసుపు జెండా, సీఎం స్పెషల్ స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. సీఎం ప్రోగ్రాంకు వచ్చే ప్రతి మహిళకూ ప్రత్యేక కిట్ ఏర్పాటు చేశారు. భోజనం ప్యాకెట్లతో పాటు ప్రత్యేకంగా తినుబండారాలు సమకూర్చారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారు.
విద్యార్థుల తల్లిదండ్రులందరూ రావాలి
డ్వాక్రా గ్రూపు సభ్యులే కాకుండా స్థానికంగా ఉన్న ఓ ప్రవేట్ స్కూల్ యాజమాన్యం సైతం జనసమీకరణ చేపట్టింది. సీఎం ప్రోగ్రామ్‌లకు స్కూల్ బస్సులు పంపుతున్నాం.. విద్యార్థుల తల్లిదండ్రులందరూ తరలిరావాల్సిందే.. అంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.