సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రగిరిలో టీడీపీ గుండారి ప్రదర్శిస్తోంది. వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరుడు, ఓ మాజీ సర్పంచ్ దుకాణాన్ని టీడీపీ గుండాలు ధ్వంసం చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. చంద్రగిరి నియోజకవర్గం, ఏ.రంగంపేట గ్రామంలో గత కొన్నేళ్లుగా చిన్నరామాపురం మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కృష్ణమూర్తి టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కూటమి పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు టీడీపీ గుండాలు శనివారం రాత్రి ఆ దుకాణం వద్ద కృష్ణమూర్తిపై దాడికి యత్నించారు. అప్రమత్తమైన ఆయన తన భార్య, కుమారుడిని వెంటబెట్టుకుని దుకాణానికి ఉన్న షట్టర్‌ను మూసివేసి లోపలే ప్రాణభయంతో తాళాలు వేసుకున్నాడు. టీడీపీ గుండాలు వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో దుకాణం ముందు ఉన్న టీ స్టాల్ స్టాండ్, సిలిండర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేసి రోడ్డుపై విసిరేశారు. నిన్ను చంపకుండా ఇక్కడి నుంచి పోము రా..! గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకండా పనిచేశావు.. అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు.
ఉప సర్పంచ్‌పై దాడికి వ్యూహం
అదే సమయంలో ఏ.రంగంపేట ఉప సర్పంచ్ మోనీష్‌పై కూడా టీడీపీ గుండాలు దాడిచేయడానికి వ్యూహం పన్నినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నాయకుల ఆగడాలపై మోనీష్ అడ్డుతలగడంతో అతనిపై దాడికి యత్నిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం కూడా కృష్ణమూర్తిపై దాడి చేసి, ఆపై మోనీష్‌తో పాటు అతని ఇంటిపై కూడా దాడికి పాల్పడాలని ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.