
కల్వర్టును ఢీకొన్న ఇన్నోవా
● కారు డ్రైవర్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి ● ఆమెరికా నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం
చంద్రగిరి: కారు కల్వర్టును ఢీకొనడంతో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితోపాటు కారు డ్రైవర్ మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట రహదారిలోని ఐతేపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి కరకంబాడి మార్గంలోని కూరపాటి రామచంద్రనగర్‌కు చెందిన లేమ(34), ఆమె భర్త కార్తీక్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అమెరికా నుంచి తిరుపతికి బయలుదేరారు. సోమవారం అర్ధరాత్రి బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి బెంగళూరుకు చెందిన ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది.
కుక్క రూపంలో కబలించిన మృత్యువు
బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి వస్తున్న దంపతులను కుక్క రూపంలో కబళించింది. కారు ఐతేపల్లి సమీపంలోని క్యాండర్ స్కూల్ వద్ద వస్తుండగా రోడ్డుకు అడ్డంగా కుక్క వచ్చింది. దీంతో కారు డ్రైవర్ రాజేష్(44) కుక్కను తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. లేమకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె భర్త కార్తీక్ 108కు సమాచారం అందించారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలు లేమను హుటాహుటిన 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ మేరకు ఎస్‌ఐ మురళీ మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమ్ముడి పెళ్లి కోసం వస్తూ పరలోకాలకు వెళ్లావా.. తల్లీ!
ఈ నెల 13వ తేదీన తన తమ్ముడి వివాహం ఉన్న నేపథ్యంలో తిరుపతికి వస్తూ తిరుగురాని లోకాలకు వెళ్లిపోయావా.. తల్లీ అంటూ బంధువుల రోదనలను మిన్నంటాయి. మార్చురీ వద్దకు చేరుకున్న బంధువులు లేమ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. శుభకార్యం జరగాల్సిన ఇంట ఇలా విషాద ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.

కల్వర్టును ఢీకొన్న ఇన్నోవా

కల్వర్టును ఢీకొన్న ఇన్నోవా