
జ్ఞాన పరంపరకు మూలం సంస్కృతం
తిరుపతి సిటీ: భారతీయ జ్ఞానపరంపరకు మూలం సంస్కృతమని, దేవభాష అధ్యయనంతో మానవ జీవితం ధన్యమైనట్టేనని వక్తలు పిలుపునిచ్చారు. జాతీయ సంస్కృత వర్సిటీలో మూడు రోజుల పాటు జరిగిన భాషోత్సవ జాతీయ సదస్సు మంగళవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఒడిశా గవర్నర్ డాక్టర్ కే హరిబాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వర్సిటీలో హెరిటేజ్ కారిడార్‌లో నూతనంగా నిర్మించిన శ్రీస్వామి నారాయణ సంప్రదాయ అక్షర పురుషోత్తమ ఆలయాన్ని అతిథులు ప్రారంభించారు. అనంతరం శ్రీజగన్నాథ మందిరంలో పూజాలు చేసి, వర్సిటీలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు. అనంతరం అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహామహోపాధ్యాయ సాధు భద్రేశదాస్ స్వామి, వేదిక్ వర్సిటీ వీసీ రాణిసదాశివమూర్తి, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, శ్రీపరమాచార్య గురుకుల కేంద్రం డైరెక్టర్ గణపతిభట్, థింక్ ఇండియా కౌన్సిల్ మెంబర్ సౌరవ్ పాండే, ఉత్కల పీఠం డైరెక్టర్ జ్ఞానరంజన్ పండా, ఉత్తరాఖండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడేంట్ వినయ్ కె రుహెల్లా, పీఆర్‌ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు, ఏపీఆర్‌ఓ కనపాల కుమార్ పాల్గొన్నారు.
తల్లిపాలలో పోషకాలు మెండు
తిరుపతి అర్బన్: తల్లిపాలలో బిడ్డలకు పోషకాలు మెండుగా లభిస్తాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తల్లిపాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వసంత బాయి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డీఐఓ శాంతకుమారి, టాటా ట్రస్ట్ సీనియర్ మేనేజర్ సుబ్రమణ్యం, మహిళా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆరు నెలలు పాటు తల్లిపాలు ఇవ్వడం, ఆ తర్వాత అనుబంధ ఆహారాలు తీసుకోవడంలో తప్పకుండా నిబంధనలు పాటించిన ఉత్తమ తల్లిదండ్రులకు బహుమతులను అందజేశారు.

జ్ఞాన పరంపరకు మూలం సంస్కృతం