
ఉపాధి..అంతా అవినీతిమయం
రామచంద్రాపురం: ఉపాధి హామి పథకం అవినీతిమయంగా మారింది. ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీల్లో రూ.లక్షల అవినీతి జరిగినట్లు ప్రత్యేక సిబ్బంది గుర్తించారు. అయితే ఇందుకు సంబంధించి అధికారులను సస్పెండ్ చేయడమే తప్ప, అవినీతికి పాల్పడిన ఫీల్డు అసిస్టెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.12.60 కోట్ల నిధులతో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి మంగళవారం మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ శాఖ జిల్లా పీడీ శ్రీనివాస ప్రసాద్, ఎంపీడీఓ ఇందిర, ఏపీడీలు చిన్నరెడ్డెప్ప, పార్వతీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 23 పంచాయతీల్లో జరిగిన పనులపై సీఆర్పీ సిబ్బంది నివేదికను చదివి వినిపించారు. మండలంలోని 23 పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ.32 వేల రికవరీ, రూ.1.97లక్షలు జరిమానా విధించడం జరిగిందని, వారి నుంచి నగదును రికవరీ చేయాలంటూ పీడీ ఆదేశించారు. అలాగే జూనియర్ ఇంజినీర్ మమత, టీఏ సుదర్శన్, బేర్‌ఫుట్ ఇంజినీర్ రమేష్‌లు విధుల్లో అలసత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను తనిఖీలను చేయడంలో నిర్లక్ష్యం వహించారంటూ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అవినీతి పరులపై చర్యలు శూన్యం
మండలంలోని ఓ పంచాయతీలో సుమారు రూ.17 లక్షలు అప్పనంగా కాజేశారని బహిరంగ సభ సాక్షిగా అధికారులు తేల్చారు. మరో పంచాయతీలో సుమారు రూ.10 లక్షలకు పైగా నొక్కేశారు. మండల కేంద్రానికి సమీపంలోని మరో పంచాయతీలో ఏకంగా మస్టర్లనే తారుమారు చేసి రూ.15 లక్షల దొంగబిల్లులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే మండల బహిరంగ సభలో ఈ అవినీతిని వెలికి తీస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు, ఉపాధి కూలీలకు నిరాశ ఎదురైంది.