
● రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం ● ఆర్టీసీ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం
తిరుపతి రూరల్ : తిరుపతి రైల్వే స్టేషన్ ఆవరణలోని ఐఆర్‌సీటీసీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి విధులకు వెళుతుండగా మార్గ మధ్యలోనే విగతజీవుడైన సంఘటన తిరుపతి రూరల్ మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి – చంద్రగిరి మార్గంలోని సి.మల్లవరం క్రాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు... చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్ బాబు (44) ఐఆర్‌సీటీసీలో టూరిస్టు గైడ్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే అతను తన సొంతూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన రాజశేఖర్‌బాబు తన ఇద్దరు కూతుళ్లను చంద్రగిరిలోని ఓ డ్యాన్స్ కోచింగ్ సెంటర్‌లో వదిలిపెట్టి జాతీయ రహదారి మీదుగా తిరుపతికి బయలుదేరాడు. జాతీయ రహదారి నుంచి సి.మల్లవరం గ్రామం మీదుగా చంద్రగిరి – తిరుపతి మార్గంలోకి చేరుకుని తిరుపతి వైపు వాహనాన్ని మళ్లించాడు. ఇంతలో తిరుపతి నుంచి పుంగనూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న ఆటోను అదిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణించే రాజశేఖర్‌బాబు తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజశేఖర్‌బాబుకు భార్య ఉషారాణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్టీసీ బస్సు అతివేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికంగా నివాసం ఉంటున్న వారు చెబుతున్నారు. మృతుడు నరసింగాపురానికి చెందిన వ్యక్తి కావడంతో సమీపంలోని గ్రామ ప్రజలు అతనిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును స్టేషన్‌కు తరలించారు. తిరుపతి రూరల్ ఎస్‌ఐ షేక్‌షావల్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెళ్లొస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు..
విధి నిర్వహణకు బయలుదేరిన రాజశేఖర్‌బాబు ఇంటి వద్దనున్న భార్య, డ్యాన్స్ క్లాస్‌లో విడిచిన పిల్లలతో వెళ్లొస్తానని చెప్పిన అర గంటకే మృత్యువాత పడడంతో కుటుంబీకులు ప్రమాద స్థలికి చేరుకుని బోరున విలపించారు. వెళ్లొస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయావా.. అంటూ మృతుడి భార్య ఉషారాణి విలపించడం చూసిన వారిలో కంటతడి పెట్టించింది.