
పంటలపై ఏనుగుల బీభత్సం
● అటవీ సరిహద్దు గ్రామాల్లో భయం..భయం ● బిక్కుబిక్కుమంటూ గడిపిన పల్లె ప్రజలు
చంద్రగిరి : ఏనుగుల గుంపు సమీప గ్రామాలపై పడటంతో పల్లె ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల పరిధిలోని మూలపల్లి అటవీ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు 9 ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నాశనం చేశాయి. వరి పంటను తొక్కి నాశనం చేయగా ఓ రైతుకు చెందిన మామిడి తోటలోని ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. పంట పొలాల సమీపంలో నివాసం ఉంటున్న రైతుల ఇళ్ల వద్దకు ఏనుగులు చేరుకోవడం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఏనుగులు ఇళ్ల వద్దకు చేరుకున్నాయని, తమకు రక్షణ కల్పించాలంటూ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రంతా బిక్కుబిక్కు మంటూ గడిపాం
ఆదివారం రాత్రి సుమారు 9 ఏనుగుల గుంపు మా పంట పొలాలపై దాడులు చేశాయి. పంటలను తొక్కి నాశనం చేయడంతో పాటు ఫెన్సింగ్ తొక్కేశాయి. ఇంటి సమీపంలోకి ఏనుగులు రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాం. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం. – నాగరాజమ్మ, దేవకమ్మ, మూలపల్లి
అటవీ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు
ఇంటి వద్దకు ఏనుగులు వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, మాకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా స్పందించలేదు. మీరు ఇంట్లోకి వెళ్లి పడుకోండంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇంటిపై ఏనుగులు దాడి చేసి ఉంటే మా ప్రాణాలు పోయేవి. – యశోదమ్మ, మూలపలి్ల

పంటలపై ఏనుగుల బీభత్సం

పంటలపై ఏనుగుల బీభత్సం