
ప్రయాణికులను బురిడీ కొట్టించే మోసగాడు అరెస్టు
● రూ.87 వేలు స్వాధీనం
తిరుపతి, అన్నమయ్య సర్కిల్ : ప్రయాణికుల సెల్‌ఫోన్ల నుంచి డబ్బులు దొంగలించే మాయగాడిని ఆదివారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన నిందితుడు వేణుబాబు సాధారణ ప్రయాణికుడిలా రైల్వే టికెట్ తీసుకుని తన తోటి ప్రయాణికులతో మాయ మాటలు మాట్లాడుతూ.. నమ్మకం కలిగిస్తాడు. తను బంధువులు, మిత్రులతో మాట్లాడడానికి అని చెబుతూ వారి మొబైల్‌ను తీసుకొని వారికి తెలియకుండా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతరత్రా డబ్బును పంపడానికి, స్వీకరించడానికి ఉపయోగించే యాప్ లను వినియోగించి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును తస్కరించి తన బ్యాంకు ఖాతాలకు పంపించుకుంటాడు. ఈ విధంగా ప్రయాణికులను బురిడీ కొట్టిస్తున్న దొంగను రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్) పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఒంగోలుకు చెందిన వేణుబాబుగా గుర్తించారు. గత సంవత్సరం 2024 అక్టోబర్ నెలలో తిరుపతి రైల్వే స్టేషన్‌లోని ఒక ప్రయాణికుడిని నమ్మించి అతడి మొబైల్‌ను తీసుకొని రూ.87 వేలు తనకు నచ్చిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నాడనే విషయాన్ని విచారణలో తెలుసుకున్నారు. అనంతరం ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్పీఎప్ ఇన్స్‌పెక్టర్ సందీప్‌కుమార్, జీఆర్పీ ఇన్స్‌పెక్టర్ ఆశీర్వాదం పేర్కొన్నారు. చాకచక్యంగా దొంగను పట్టుకున్న ఎస్‌ఐలు ధర్మేంద్ర, రామకృష్ణ బృంద సభ్యులను రైల్వేస్టేషన్ అధికారులు అభినందించారు.