
బదిలీ ఉత్తర్వులు భేఖాతరు
కలువాయి (సైదాపురం) : మండలంలోని తోపుగుంట సచివాలయ వీఆర్‌ఓగా వంశీప్రదీప్ బదిలీ ఉత్తర్వులతో ఇటీవల కలువాయి తహసీల్దార్‌ను కలిసి విధుల్లోకి అనుమతించాలంటూ జాయినింగ్ రిపోర్టు ఇచ్చాడు. అయితే ఇందుకు జిల్లా అధికారుల బదిలీ ఉత్తర్వులను తహసీల్దార్ బేఖాతార్ చేశారు. దీంతో పది రోజులు కావస్తున్నా తన పరిస్థితి ఏమిటో అర్థం కాక వీఆర్‌ఓ జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు. దీంతో డీఆర్‌ఓ కలువాయి తహసీల్దార్‌తో ఫోన్‌లో సంప్రదించి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు వీఆర్వో వంశీ ప్రదీప్ తెలిపారు. డీఆర్వో ఇచ్చిన గడువు కూడా ముగిసిందని వీఆర్వో వాపోయాడు. కూటమి నేతలు ఓకే చెబితేనే ఆయా గ్రామ సచివాలయాల్లో బదిలీకి అనుమతిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
త్రుటిలో తప్పిన ప్రమాదం
కేవీబీపురం: మండలంలోని వీజే క్వారీ నుండి తరలిస్తున్న సుమారు పది టన్నుల బరువున్న భారీ బండ ప్రమాదవశాత్తు వాహనంలో నుండి రోడ్డుపై పడింది. పెరిందేశం రెవెన్యూ పరిధిలోని వీజే క్వారీ నుండి ఆదివారం తెల్లవారుజామున 30 టన్నులు బరువున్న మూడు భారీ బండలను పెద్ద కంటైనర్‌లో తరలించారు. ఆ వాహనం కేవీబీపురం పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న స్పీడ్‌బ్రేకర్ వద్దకు చేరుకోగానే వాహనంలోని ఒక భారీ బండ కింద పడింది. దీంతో ఆ వాహనం వెనుక వస్తున్న వాహనాలు త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాయి. రోడ్డుపై పడిన బండను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు.
ఎస్‌బీ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
తిరుపతి క్రైమ్: తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న గిరిధర్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు. వీఆర్‌లో ఉన్న వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. గతంలో స్థానికంగా ట్రాఫిక్, తిరుపతి డీఎస్పీగా పనిచేసిన అనుభవం తనకు చాలా ఉందని, ఈ అనుభవంతో శాంతి భద్రతలను కాపాడుతానని ఆయన చెప్పారు.