
గ్రీన్‌ఛానల్ ద్వారా గుండె మార్పిడి
● గుంటూరు నుంచి తిరుపతికి తరలించిన వైద్యులు
తిరుపతి తుడా : గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న గోదావరి జిల్లాకు చెందిన నారాయణరావు( 34)కు గుంటూరుకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి గుండెను విజయవంతంగా అమర్చిన ఘటన తిరుపతిలోని టీటీడీ పరిధిలో నడుస్తున్న శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన జ్యోత్రిభాను(55) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు రమేశ్ హాస్పటల్ వైద్యులు నిర్ధారించారు. ఆ విషయాన్ని వైద్యులు బాధితుడి కుటుంబ సభ్యులకు వివరించడంతో అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. వెంటనే ఆస్పత్రి నిర్వాహకులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో జ్యోత్రిభాను అవయవాలను తరలించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే నారాయణరావు(34) కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతి శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం జీవన్ధాన్ పోర్టల్లో నమోదు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి చేరుకొని అక్కడి వైద్యులు, కుటుంబ సభ్యులతో సంప్రదించి జ్యోత్రిభాను నుంచి గుండె సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి గురువారం రేణిగుంట విమానాశ్రయానికి అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి తీసుకొచ్చి నారాయణరావుకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.