
తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందాలి
తిరుపతి అర్బన్ : దేశంలోనే కీలకమైన ప్రదేశాల్లో తిరుపతి ఒకటని, అయితే ఆ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితల అభిప్రాయపడ్డారు. తిరుపతి పట్టణ సమగ్రాభివృద్ధిపై స్టేక్ హోల్డర్లతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఇషా కాలియా, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్ , తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలసి బుధవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి శర వేగంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లడంతోనే సరిపెట్టేస్తున్నారని పేర్కొన్నారు. అలా కాకుండా రెండు మూడు రోజులు ఈ ప్రాంతంలో యాత్రికులు ఉండేలా వసతులు కల్పిస్తే వారు ఉంటారని చెప్పారు. దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ ఏటా రూ.లక్ష కోట్లతో జరుగుతోందని పేర్కొన్నారు. అయితే తిరుమలలో పెళ్లిళ్లు జరుగుతున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు ఉండడం లేదని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీనివాస్