
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
● మహిళా ఉద్యోగి మృతి, 15 మందికి గాయాలు
రేణిగుంట : టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు వెనుక వైపు వేగంగా వచ్చి ఢీకొనడంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మహిళా ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందింది. 15 మందికి గాయాలు కాగా ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు నారాయణవనం నుంచి తమ కంపెనీ ఉద్యోగులను ఎక్కించుకొని వస్తున్న సమయంలో శనివారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు రేణిగుంట సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాల ఎదురుగా టైర్ పంచర్ అవడంతో రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక వైపున ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న నారాయణవనానికి చెందిన ఊహ మహాలక్ష్మి (25) మృతి చెందగా మరో మహిళకు కాలు విరిగింది. మొత్తం 15 మందికి గాయాలు కాగా పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శించారు.