
ఐపీఎల్ తరహాలో సీపీఎల్
● జాతీయ స్థాయిలో ఆడేందుకు పునాది కావాలి ● పోటీలను ప్రారంభించిన కమిషనర్ మౌర్య
తిరుపతి ఎడ్యుకేషన్ : ఐపీఎల్ తరహాలో చిత్తూరు ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నిర్వహించడం అభినందనీయమని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో నిర్వహిస్తున్న సీపీఎల్ సీజన్–1 క్రికెట్ పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడేందుకు సీపీఎల్ పునాది కావాలని కోరారు. ఏపీఎల్, ఐపీఎల్‌లో ఆడేందుకు సీపీఎల్ చక్కని వేదికని, ఆ మేరకు క్రికెటర్లు లక్ష్యం నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. సీడీసీఏ అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ తగినంత అవకాశాలు, ప్రోత్సాహం లేకపోవడంతో యువత క్రికెట్‌లో రాణించలేకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సీపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే అండర్–16 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, కాంట్రాక్టర్ హేమంత్‌కుమార్‌రెడ్డి, ఎడిఫై డైరెక్టర్ ప్రణీత్, మారుతీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మారుతీ కృష్ణ, సీడీసీఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరి ప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీధర్ కుమార్, శ్రీనివాసమూర్తి, మురళీ యాదవ్, జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్ పాల్గొన్నారు.
ఆదిత్య, పాయ్ వైస్రాయ్ జట్లు విజయం
సీపీఎల్ సీజన్–1 క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. తొలిరోజు ఆదిత్య, పాయ్ వైస్రాయ్ జట్లు విజయం సాధించాయి. ముందుగా ఆదిత్య జట్టు, హైపీరియన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆదిత్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. రంజీ ప్లేయర్ అభిషేక్ రెడ్డి 50 బంతుల్లో 80 పరుగులతో రాణించాడు. బౌలింగ్‌లో డానియల్ దాస్ 3 వికెట్లు సాధించాడు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైపీరియన్ జట్టు 16.4ఓవర్లలో 132 పరుగులకు అలౌట్ కావడంతో ఆదిత్య జట్టు 41పరుగుల తేడాతో గెలుపొందింది. ఆదిత్య జట్టు బౌలర్ అనిల్‌కుమార్ 3 వికెట్లు సాధించాడు. 80 పరుగులు చేసిన అభిషేక్‌రెడ్డి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మధ్యాహ్నం పాయ్ వైస్రాయ్, రాయల్ చాలెంజ్ తిరుచానూరు జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాయ్ వైస్రాయ్ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. వాహీద్ బాషా 20 బంతుల్లో 40 పరుగులు, ధరణికుమార్ 22 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు. బౌలింగ్‌లో ప్రవీణ్‌రాజ్, దీపక్ సాయి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజ్ తిరుచానూరు జట్టు 18 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాయ్ వైస్రాయ్ జట్టు 40పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన సూర్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద పాయ్ వైస్రాయ్ హోటల్ మదన్‌మోహన్ రూ.2,500 నగదు బహుమతి అందించారు.
నేడు తలపడే జట్లు
సీపీఎల్ సీజన్–1 పోటీల్లో భాగంగా శనివారం ఉదయం ఆదిత్య లెవెన్స్, రాయల్ చాలెంజ్ తిరుచానూరు జట్లు తలపడనున్నాయి.అలాగే మధ్యాహ్నం హైపీరియన్, స్పార్టన్ వారియర్స్ జట్లు బరిలో దిగనున్నాయి.