
కార్యకర్తలకు అండగా ఉండాలని ఆదేశం
వరదయ్యపాళెం : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ బుధవారం తాడేపల్లె కేంద్ర కార్యాలయంలో కలిశారు. కూటమి నేతల ఆగడాలపై రాతపూర్వకంగా వినతిపత్రం అందించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని ఆదేశించారు. కూటమి నేతల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్ర వర్మ, సత్యవేడు మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, నేతలు చంద్రశేఖర్ రెడ్డి, బెల్టు రమేష్, ఎంపీపీలు దివాకర్ రెడ్డి, ప్రతిమారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఆన్‌కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : మంగళం ఆర్టీసీ డిపోలో ఆన్‌కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎం కేసీడీ భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది 18 నెలలు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. ఆసక్తిగలవారు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంగళం డిపోలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ప్రతి రోజూ డ్యూటీ దిగిన తర్వాత వేతనం చెల్లించేస్తామని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 9177150347 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పద్మావతి ఆస్పత్రిలో
ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ప్రత్యేక ఓపీ
తిరుపతి తుడా : స్విమ్స్ పరిధిలోని పద్మావతి ఆస్పత్రిలో ప్రతి గురువారం ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ప్రత్యేక ఓపీ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గర్భిణుల్లో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇతర సమస్యలు ఉన్నవారిని ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్యం అందించేందుకు ఈ ప్రత్యేక ఓపీని ప్రారంభిస్తున్నామని వివరించారు. పద్మావతి ఆస్పత్రిలో మధ్యాహ్నం 12గంటలకు రూమ్ నంబర్ 22లో ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ఓపీ ఉంటుందని తెలిపారు.
ఏపీ ఈఏపీసెట్ కేంద్రం పరిశీలన
తిరుపతి సిటీ : ఏపీ ఈఏపీ సెట్ నిర్వహిస్తున్న తిరుపతి జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ కేంద్రాన్ని ఎస్వీయూ వీసీ అప్పారావు బుధవారం పరిశీలించారు. వీసీ మాట్లాడుతూ ప్రశాంతవాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు పక్కాగా మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు.
దశాబ్దాలుగా సీమవాసుల కల.. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల ఆకాంక్ష.. ఏళ్ల తరబడి నిరీక్షణ.. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాయలసీమ వాసుల్లో ఆశలు చిగురించాయి. ప్రత్యేక డివిజన్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిపుణుల నుంచి సైతం సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.