
పోలీస్ గ్రీవెన్స్‌కు 67 వినతులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
పది సప్లిమెంటరీకి 466 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం తెలుగు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,647 మంది హాజరుకావాల్సి ఉండగా వారిలో 466 మంది గైర్హాజరవ్వడంతో 1,181 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 167 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. వారిలో 25 మంది గైర్హాజరవ్వడంతో 142 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈఓ పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వెంకటగిరి రూరల్ : పట్టణంలోని ఎస్‌పీకేఎం ఐఐహెచ్‌టీ (శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ)లో డిప్లొమా కోర్సులు చేయడానికి ఈనెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఓఎస్‌డీ ఎస్.గిరిధర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిహెచ్‌టీటీ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కోర్సులో మొత్తం 53 సీట్లు ఉన్నాయని, తమిళనాడులోని సేలం 12, కర్ణాటకలోని గడక్‌లో 4 సీట్లుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పదోవ తరగతి ఉత్తీర్హులైన వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. లేదా ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, ఒకేషనల్ (టెక్స్‌టైల్స్, ఐటీఐ రెండేళ్లు) కోర్సులు పూర్తిచేసుకున్న వారు నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందచ్చని తెలిపారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా చేనేత, జౌళిశాఖలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఆసక్తిగల వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఐఐహెచ్‌టీవీజీఆర్.కమ్, 9866169908, 9010243054 నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.
మృత్యుంజయుడికి విశేష పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ్లం, పసుపు, కుంకుమ, విభూధి వంటి వాటితో అభిషేకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.

పోలీస్ గ్రీవెన్స్‌కు 67 వినతులు