
గౌరవమూ లేదు.. వేతనమూ రాదు
● ఎంపీటీసీలకు రెండేళ్లుగా అందని గౌరవ వేతనాలు ● ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పక్కన పెట్టేశారు ● టీడీపీ మద్దతుదారులకే ప్రాధాన్యం ● తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని పలువురు ఆవేదన
వరదయ్యపాళెం: కూటమి ప్రభుత్వం అధికారులోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు గౌరవంతోపాటు వేతనాలు లేకుండా పోయాయి. ఎంపీటీసీ సభ్యునికి నెలకు రూ.3వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత ప్రభుత్వం ఎంపీటీసీలకు వేతనాలు చెల్లించలేకపోయింది. జూన్ 30న కొత్తగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అంతకుముందు పెండింగ్‌లో ఉన్న వేతనాలతో పాటు దాదాపు రెండేళ్లకు పైగా వేతనాలు రావాల్సి ఉంది. కానీ నేటికీ తమకు రావాల్సిన వేతనాలపై దృష్టి సారించడంలేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. ప్రజలచేత ఎన్నికై న ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేం, అభివృద్ధి పథకాల్లో టీడీపీ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు అధికారులు ఇవ్వడం లేదని వాపోతున్నారు.
సర్వసభ్య సమావేశాలకే పరిమితం
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసభ్య సమావేశాలకు హాజరుకావడమే తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలని మండల అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం తమను ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. నిధులు మంజూరుపైనా తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటున్నారు. ఇలా తమను వివక్షతకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.