
గాడి తప్పిన బర్డ్!
● మదనపల్లెకు చెందిన నజీర్ అనే వ్యక్తి సర్జరీ కోసం ఆరు నెలల క్రితం బర్డ్ ఆస్పత్రికి వచ్చాడు. ఓపీ తీసుకుని వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నాడు. మోకాలికి శస్త్రచికిత్స అనివార్యమని డాక్ట ర్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను తీసుకెళితే కార్యాలయ సిబ్బంది పరి శీలించి మార్చిలో ఓ తేదీని సర్జరీకి ఖరారు చేశా రు. అదే తేదీన ఆపరేషన్ జరుగుతుందనే నమ్మకంతో నజీర్ ఆస్పత్రికి వచ్చాడు. అయితే మరో నెల తర్వాత రావాలని బర్డ్ సిబ్బంది వెనక్కి పంపించేశారు. మరోసారి నిర్దేశించిన తేదీ ప్రకారం ఏప్రిల్‌లో సర్జరీ కోసం రాగా అదే సమాధానం రావ డంతో బాధితుడు నిలదీశాడు. దీంతో ఈ నెలలో కచ్చితంగా శస్త్రచికిత్స చేస్తామని పంపేశారు.
● అనంతపురం జిల్లా యల్లనూరుకు చెందిన లక్ష్మమ్మ అనే మహిళ పరిస్థితి అయితే మరింత దయనీయం. మోకీలు మార్పిడి కోసం ఇప్పటికే ఆస్పత్రి చుట్టూ పలుమార్లు తిరిగింది. రెండు నెలల క్రితం సర్జరీ కోసం తేదీని ఖరారు చేసిన బర్డ్ అధికారులు ఆ రోజు ఆస్పత్రికి వస్తే బెడ్లు లేవని వెనక్కి పంపించారు. ఈనెల 5వ తేదీ సోమవారం రోజున సర్జరీ తేదీని ఇచ్చారు. అన్ని సర్దుకుని కుటుంబ సభ్యులతో సహా ఆస్పత్రికి రాగా ఈరోజు కుదరదు వచ్చే నెలలో రావాలంటూ మరోసారి వెనక్కి పంపించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులతో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. ఎప్పుడు అవకాశం ఉంటే అదే తేదీని ఇవ్వ కుండా ఇలా తిప్పించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి మచ్చుకు రెండు కేసులు మాత్రమే. ఇలా ఒకరిద్దరు కాదు. సర్జరీ కోసం వచ్చే రోగులలో ఎక్కువ మందికి ఈ అనుభవాలే ఎదురవుతున్నా యి. టీటీడీ బర్డ్ ఆస్పత్రి పాలన గందరగోళంగా మారింది. దాదాపు పది నెలలుగా పర్యవేక్షణ లేకపోవడంతో ఆస్పత్రి అస్తవ్యస్తంగా తయారైంది. వైద్యులు, సిబ్బంది, కార్యాలయ ఉద్యోగుల మధ్య సమన్వయ లోపంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు.
తిరుపతి తుడా: తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి రోజూ 300 వందలకు పైగా ఓపీలు వస్తుంటాయి. ఇందులో 10 మంది వరకు వివిధ సర్జరీల కోసం రెఫర్ అవుతుంటారు. బెడ్ ఖాళీల ప్రకారం రోగులకు సర్జరీ తేదీని ఖరారు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. సమన్వయలోపంతో శస్త్రచికిత్సల తేదీ ఖరారు విషయంలో స్పష్టత కరువైంది. బెడ్ల వివరాలు, వైద్యుల సమాచారం తెలుసుకుని తేదీని ఖరారు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టారాజ్యంగా తేదీలను నిర్ధారిస్తుండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు మారుస్తూ తేదీలను కేటాయిస్తుండటంతో అనేక వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులు సుదూర ప్రాంతాల నుంచి పలుమార్లు బర్డ్ ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అధికారుల తీరు రోగులకు శాపంగా మారింది. బర్డ్ వైద్య సిబ్బంది ఇప్పటికై నా రోగుల సర్జరీ విషయంలో పక్కా ప్రణాళికలతో తేదీలను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పర్యవేక్షణ కరువై అస్తవ్యస్తంగా పాలన
ఆస్పత్రి సిబ్బందిలో లోపించిన సమన్వయం
నానా అవస్థలు పడుతున్న రోగులు
శస్త్రచికిత్సలకు పడిగాపులు
నెలల తరబడి ప్రదక్షిణలు
వేధిస్తున్న వైద్యుల కొరత
బర్డ్ ఆస్పత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు కరువయ్యారు. కేవలం ఇద్దరు మాత్రమే సీనియర్ వైద్యులు ఉండడంతో భారమంతా వారి పైనే పడుతుంది. నాణ్యతతో కూడిన వైద్యం అందించాలంటే మరింత మంది సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ల అవసరం ఉంది. గతంలో దేశంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లను బర్డ్ ఆస్పత్రికి రప్పించి ఖరీదైన వైద్యాన్ని రోగులకు అందించేవారు. ఇందుకోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి టీటీడీ పాలకమండలి అనేక నిర్ణయాలను తీసుకుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ వైద్యులు రాకపోవడంతో బర్డ్‌లోని డాక్టర్లే ఆపరేషన్లు చేస్తున్నారు. బర్డ్ ఆస్పత్రిలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటాయన్న ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అయితే ప్రస్తుతంఅలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. రోగి ఓపీ తీసుకోవడం మొదలు వైద్యుల వద్ద పరీక్షలు చేసుకోవడం, ఆపై సర్జరీలు చేసుకుని తిరిగి వెళ్లేవరకు అంతా తికమకగా ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న బర్డ్ ఆస్పత్రిని గాడిలో పెట్టి ఉన్నత ప్రమాణాలతో సకాలంలో వైద్య సేవలు అందించేలా టీటీడీ చర్యలు తీసుకోవాల్సి ఉంది.