సునీల్‌ నాయక్‌ కుటుంబానికి అండగా షర్మిల

YS Sharmila Donating Blood To Sunil Nayak Family - Sakshi

వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా జాబ్‌మేళా

మహానేత వైఎస్‌ఆర్‌కు ఘన నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల  

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్‌కు చెందిన నిరుద్యోగి బోడ సునీల్‌ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అండగా నిలిచారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ 12వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్‌ కన్వీనర్‌ ఇరుమళ్ల కార్తీక్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా జరిగింది. ఈ జాబ్‌ మేళాలో సునీల్‌ నాయక్‌ తమ్ముడు బోడ శ్రీనివాస్‌ నాయక్‌కు ఉద్యోగం కల్పిస్తూ షర్మిల నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, జీవితంలో స్థిరపడాలని సూచించారు.

ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన్లను విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని, యువత కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌టీపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జాబ్‌ మేళాలో ఉద్యోగాలు పొందిన 250 మందికి  నియామక పత్రాలు అందజేశారు. మరో 700 మందికి వివిధ దశల్లో ఇంట ర్వూ్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి, నివాళి అర్పించారు.  అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె రక్తదానం చేశారు.   హైదరాబాద్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన దార్శనికుడు వైఎస్‌ఆర్‌ అని పార్టీ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ కొనియాడారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top