
కేసీఆర్ కిట్ల నిలిపివేతతో మహిళలకు ఇబ్బందులు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రేపు సిరిసిల్లలో 5 వేల మంది తల్లులకు కిట్లు పంచుతామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు మంచి పేరు రావద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్ల’పంపిణీని నిలిపివేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో రాష్ట్రంలో మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’పేరిట ఈ నెల 24న సిరిసిల్లలో 5 వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లు అందజేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన పలువురు తల్లీ బిడ్డలకు కేసీఆర్ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పంపిణీని 20 నెలలుగా నిలిపివేయడంతో మహిళలు బాధ పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చి ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను కేసీఆర్ పెరిగేలా చేశారని తెలిపారు. 2014కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని జనాలు భయపడేవారని, సీఎంగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని చెప్పారు.
ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మోసం
ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. బీఆర్‌ఎస్ బీసీ నేతలతో మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నివాసంలో కేటీఆర్ భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రం ఆమోదించదని తెలిసినా, ఆర్డినెన్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని నేతలు విమర్శించారు. కులగణనలో బీసీల సంఖ్య తక్కువగా చూపడం, బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోవడం వెనుక కాంగ్రెస్ దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తంచేశారు.
బీసీ రిజర్వేషన్లపై కోర్టులు, చట్టపరమైన అంశాలను సాకుగా చూపుతూ కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కులగణనను మరింత శాస్త్రీయంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం అత్యంత లోపభూయిష్టంగా నిర్వహించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో బీసీల కోసం ప్రారంభించిన పథకాలను రద్దు చేసి కాంగ్రెస్ మోసగిస్తోందని మండిపడ్డారు.