
బస్సుల్లో కండక్టర్ల సూచనలు.. జీరో టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ
ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్‌లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పేరే
వాటిని సవరించుకునేందుకు ఆధార్ కేంద్రాలకు పోటెత్తుతున్న మహిళలు
తాము అలాంటి ఆదేశాలివ్వలేదంటున్న ఉన్నతాధికారులు
కానీ.. బస్సుల్లో పది రోజులుగా కొనసాగుతున్న అలజడి
సాక్షి, హైదరాబాద్: ఆధార్ సవరణ కేంద్రాలకు ఉన్నట్టుండి మహిళలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డుల్లో ఇంటి చిరునామాలో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ అని మార్చుకుంటున్నారు. కొందరు ఫొటోలను అప్‌డేట్ చేసుకుంటున్నారు. మీసేవ కేంద్రాలు, పోస్టాఫీస్ ఆధార్ సెంటర్లు, ఆధార్ సవరణ కేంద్రాలు.. ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ ఆధార్ కార్డులను సవరించుకునేందుకు మహిళలు పోటెత్తుతున్నారు. ఆధార్ కార్డులోని ఇంటి చిరునామాపై తెలంగాణ బదులు ఏపీ అని ఉంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండదని, కచ్చితంగా టికెట్ కొనాల్సిందేనంటూ కొందరు కండక్టర్లు అత్యుత్సాహంతో చేసిన ప్రచారం ఫలితమిది.
– మహేశ్వరం సమీపంలోని ఓ కాలనీకి చెందిన మహిళ తుక్కుగూడ నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లేందుకు మహేశ్వరం డిపో బస్సు ఎక్కారు. ఆధార్ కార్డులో తెలంగాణ బదులు ఏపీ అని ఉండటంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. చేసేది లేక రూ.25 టికెట్ కొని ప్రయాణించాల్సి వచ్చింది. ‘దీనిపై మహేశ్వరం డిపో అధికారులకు ఫిర్యాదు చేస్తే, చిరునామాలో తెలంగాణ బదులు ఏపీ అని ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు’అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
– నాలుగు రోజుల క్రితం బూర్గంపహాడ్ ఇంటి చిరునామా ఉన్న ఆధార్‌కార్డుతో ఓ మహిళ నగరంలోని మెహిదీపట్నంలో బస్కెక్కగా, కండక్టర్ ఉచిత ప్రయాణానికి అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్‌కార్డు కావటంతో దానిపై తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని ఉండటమే కారణం. దీంతో ఆ మహిళ ఆ బస్సు దిగి మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది.
ఇలా నిత్యం కొన్ని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు జీరో టికెట్లను నిరాకరిస్తుండటంతో ఇప్పుడు అలజడి రేగింది. కొన్ని బస్సుల్లో కండక్టర్లు నోటీసులు అతికించి మరి ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయించుకోవాలని, లేని పక్షంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని రాసి ఉన్న సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు.
అలాంటి ఆదేశాలు లేకున్నా...
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డులను చాలామంది ఇప్పటికీ అలాగే వాడుతున్నారు. ఇళ్లు మారినవారు, ఫోన్‌నంబర్లు మారినవారు ఆధార్ కార్డుల్లో ఆ మేరకు మార్పుల వివరాలను సవరించుకుంటుండగా, ఎలాంటి మార్పులు జరగనివారు పాత ఆధార్‌కార్డులనే వాడుతున్నారు. ఏపీ పేరున్న ఆధార్ కార్డులు అన్నిచోట్లా చెల్లుబాటు అవుతుండగా, ఒక్క ఆర్టీసీ బస్సుల్లోనే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విశేషం. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే, తాము డిపో మేనేజర్లకు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని, ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్ కార్డుల్లో తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా, వాటిని అనుమతించాల్సి ఉంటుందని పేర్కొనటం విశేషం.
ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన కొత్తలో మాత్రం రెండుమూడు పర్యాయాలు, ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాలన్న ప్రకటన వెలువడిందని, ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ, ఒకరిని చూసి మరొకరుగా ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అనుమతించడం లేదు. కొందరు టికెట్ చెకింగ్ సిబ్బంది కూడా తెలంగాణ అని లేకపోతే తప్పుపడుతున్న సందర్భాలూ ఉన్నాయి.
చిన్ననాటి ఫొటో ఉంటే మార్చుకోవాల్సిందే..
ఆధార్ కార్డులు అమలులోకి వచ్చిన 15 ఏళ్ల క్రితం, అప్పటి చిన్నారుల కార్డులు ఇప్పటికీ కొందరు వాడుతున్నారు. వాటిపై చిన్ననాటి ఫొటోలే ఉన్నాయి. ఇప్పుడు వారి వయసు పెరిగిన నేపథ్యంలో, ఆ కార్డు వారిదా కాదా అని ధ్రువీకరించుకోవటం కండక్టర్లకు పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి కార్డుల్లో ఫొటోలను అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అనుమతించకపోవటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది.