
వేయి కళ్లతో కుమార్తె ఎదురుచూపులు
తల్లిదండ్రుల కోసం స్వీడన్ నుంచి వరంగల్‌కు
పద్మశాలి సంఘం ప్రతినిధులను కలిసిన సంధ్యారాణి
కన్నవారి కోసం సముద్రాలు దాటి వచ్చింది. వేల కిలోమీటర్లు ప్రయాణించింది. భాష రాకపోయినా.. తెలిసిన వారెవరూ లేకపోయినా.. అమ్మానాన్న జాడ కోసం 16 ఏళ్లుగా అన్వేషిస్తోంది. వారి ఫొటోలు లేకపోయినా, ఆనవాళ్లు తెలియకపోయినా.. వారిని కలుస్తాననే దృఢ నిశ్చయంతో ఉంది. కన్నవారిని కలిసేదాకా నిద్రపోనని చెబుతున్న స్వీడన్‌కు చెందిన సంధ్యారాణి ఆదివారం వరంగల్ నగరంలో తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించింది.
ఖిలా వరంగల్: చిన్నతనంలో ఓ అనాథాశ్రమంలో పెరిగిన కుమార్తె సంధ్యారాణి తల్లిదండ్రుల కోసం అన్వేషిస్తోంది. కన్నవారిని కలవాలని స్వీడన్ దేశం నుంచి ఆమె ఆదివారం వరంగల్‌కు వచ్చింది. తల్లిదండ్రుల మూలాలు ఇక్కడే ఉన్నాయని వరంగల్ శివనగర్‌లోని పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్‌తోపాటు పద్మశాలి సంఘాల ప్రతినిధులను కలిసింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మా తల్లిదండ్రులు రాజ్‌కుమార్, అనసూయ. కొందరు నా తల్లి చనిపోయిందని అంటున్నారు. కానీ, ఆమె చనిపోలేదు. నా వయసు రెండేళ్లు ఉన్నప్పుడు బతుకుదెరువు కోసం నాన్న నన్ను తీసుకుని హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్ వెళ్లాడు. అక్కడ నిజాం కాలేజీ తోటమాలి రామయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అక్కడే ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేశాడు. ఈ విషయం తెలిసి రామయ్య తన మరదలు విజయను నాన్నకు ఇచ్చి వివాహం చేశాడు. మూడు నెలలు ఆమెతో కాపురం చేసిన ఆయన ఓ రాత్రి నన్ను విజయ దగ్గరే వదిలేసి పత్తాలేకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం రామయ్య గాలించినా దొరకలేదు. దీంతో విజయ.. మూడేళ్ల వయసున్న నన్ను విజయనగర్ కాలనీలోని ‘సేవా సమాజం.. బాలికా నిలయం’ అనే అనాథాశ్రమంలో వదిలేసింది.
ఆశ్రమం నుంచి స్వీడన్‌కు దత్తత..
సంతానం లేని స్వీడన్‌కు చెందిన లిండ్, గ్రేన్ నన్ను ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. చిన్నతనం నుంచి అక్కడే పెరిగి పెద్దయ్యా. ఊహ తెలిసినప్పటి నుంచి స్వీడన్ నా దేశం కాదు.. వాళ్లు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని గ్రహించా. పైచదువుల కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో నా అసలు పేరెంట్స్ గురించి 2009 నుంచి అన్వేషణ ప్రారంభించా. ఇందులో భాగంగా ఆదివారం వరంగల్ శివనగర్‌కు చేరుకున్నా. పద్మశాలి సంఘం ప్రతినిధి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్‌ను కలిశా. తన తండ్రి రాజ్‌కుమార్, తల్లిపేరు అనసూయ. ఏళ్లు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులను కలుసుకోవాలని ఇండియాకు వచ్చా. మూలాలు వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చా. నా తల్లిదండ్రులు తెలిస్తే 9822 206485 నంబర్‌కు కాల్‌చేయండి. తల్లిదండ్రులను ఎలాగైనా కలుస్తాననే నమ్మకం నాలో దృఢంగా ఉంది’ అని సంధ్యారాణి కన్నీటి పర్యంతమైంది.