KMC: వైద్యకళాశాలలో మరోసారి ర్యాగింగ్‌ కలకలం

Warangal: Ragging Mystery In KMC College  - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ( కేఎంసీ )లో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. సీనియర్ విద్యార్థులు మద్యం మత్తులో ఫ్రెషర్స్ డే పేరుతో జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ట్విట్టర్ లో ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం అందరిని ఆందోళన కు గురిచేస్తుంది. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి, అలాంటిది ఏమి లేదని తేల్చారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ద్వారా ఆరా తీస్తున్నారు.

వరంగల్ కేఎంసీలో ట్విట్టర్ వేదికగా
 ర్యాగింగ్ ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినీయర్స్ 50 మంది మద్యం తాగి తమను వేధిస్తున్నారని ట్వీట్టర్ ద్వారా రెడ్డి పేరుతో ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రమంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు.‌ సోషల్ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయంపై ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆరా తీశారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాసు ను వివరణ కోరగా అలాంటిది ఏమిలేదన్నారు. జూనియర్ విద్యార్థుల హాస్టల్, సీనియర్ల హాస్టల్ భవనాలు దూరంగా ఉంటాయని తెలిపారు. సీనియర్లు కొందరు జన్మదిన వేడుకలు చేసుకున్నారని, ఆ సందర్భాన్ని గిట్టనివారు ఇలా చిత్రీకరిస్తున్నారని తేల్చిచెప్పారు.

కేఎంసీలో జరగాల్సిన ప్రెషర్ డే కు సైతం అనుమతి ఇవ్వలేదన్నారు.‌ ట్విటర్ లో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసు కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు కేఎంసీలో విచారణ నిర్వహించారు.‌ ర్యాగింగ్ పై తమకు విద్యార్థులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఏసీపీ గిరికూమార్ తెలిపారు. ట్విట్టర్ లో వచ్చిన ఫిర్యాదు పై సైబర్ క్రైమ్ ద్వారా విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

గిరి కూమార్ - ఏసిపి, వరంగల్.
రెండు మాసాల క్రితం ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కళాశాలలో ర్యాగింగ్ కు గురయ్యారనే ప్రచారం జరిగింది.‌ తాజాగా మద్యం మత్తులో సీనియర్స్ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని జూనియర్ విద్యార్థిగా అజ్ఞాత వ్యక్తి ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రి, హోంమంత్రి, రాష్ట్రమంత్రి కి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది.‌ నిప్పులేనిదే పొగరాదని స్థానికులు భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top