ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటలేక గుండెపోటుకు గురైన వ్యక్తి మృతి

Vikarabad: Man Dies Of Heart Attack After Failing To Cross Cagna River - Sakshi

సాక్షి, ధారూరు: ఉధృతంగా ప్రవహిస్తున్న కాగ్నా నదిని దాటలేక గుండెపోటుకు గురైన ఓ వ్యక్తిని మరో మార్గంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన ధారూరు మండలంలో గురువారం రాత్రి జరిగింది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. దోర్నాల్‌ గ్రామానికి చెందిన దినసరి కూలీ మహ్మద్‌ జిలానీ(41)కి గురువారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ఓ ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు.

ధారూరు నుంచి వికారాబాద్‌ తీసుకెళ్లే క్రమంలో దోర్నాల్‌ సమీపంలో కాగ్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాత్కాలిక వంతెనపై వేసిన మట్టి పూర్తిగా కొట్టుకపోవడంతో సిమెంట్‌ పైపులు తేలాయి. వాటిపై నుంచి దాటే యత్నం చేయగా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు హెచ్చరించారు. దీంతో చేసేది లేక ఆటోను వెనక్కి మళ్లించారు.తాండూర్‌లోని జిల్లా ఆస్పత్రికి జిలానీని తరలిస్తుండగా యాలల మండలం రాస్నం గ్రామ సమీపంలో ఆయన కన్నుమూశాడు. కాగ్నానది ఉధృతంగా ప్రవహించడం, ధోర్నాల్‌ సమీపంలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పూర్తి చేయకపోవడంతో జిలానీ ప్రాణాలు గాలిలో కలిశాయని కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన జిలానీ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్‌ సుజాత ప్రభుత్వాన్ని కోరారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top