నా బిడ్డలిద్దర్నీ ఆశీర్వదించండి 

Vijayamma Emotional At The YS Memorial Sabha - Sakshi

వైఎస్‌ సంస్మరణ సభలో విజయమ్మ భావోద్వేగం 

ఏపీలో రాజన్న పాలన తెచ్చే ప్రయత్నంలో జగన్‌ ముందుకెళ్తున్నారు 

తెలంగాణలో వైఎస్‌ కలలు నెరవేర్చేందుకు షర్మిలకు సహకరించండి

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు తన బిడ్డలిద్దరినీ ఆశీర్వదించాలని ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. పదేళ్ల పాటు పడ్డ కష్టంతో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం అయిన తన కుమారుడు వైఎస్‌ జగన్‌ రాజన్న పాలన తెచ్చే ప్రయత్నంలో ముందుకెళుతున్నారని తెలిపారు. తెలంగాణను సస్యశ్యామలం చేసి అన్నపూర్ణగా మార్చాలని వైఎస్‌ కన్న కలలు, ఆశయాల సాధనకు.. ఇక్కడ రాజన్న రాజ్యం తేవడానికి షర్మిలమ్మకు సహకరించాలని కోరారు. తమ ముద్దుబిడ్డ షర్మిలను వైఎస్‌ ఎంతో ప్రేమగా చూసేవారని, అలాంటి అమ్మాయి తెలంగాణలో ఆయన కలలు నెరవేర్చడానికి ముందుకు వస్తున్నందున ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

గురువారం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా హెచ్‌ఐసీసీలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగింపులో మాట్లాడుతూ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న విజయమ్మను చూసి వేదికపైకి వచ్చిన షర్మిల ఆమెను ఓదార్చారు. సభ ప్రారంభంలో కూడా వైఎస్‌ను స్మరించుకుని విజయమ్మ కంటతడి పెట్టారు. ఇది రాజకీయపార్టీ సమావేశం కాదని వైఎస్‌ ప్రేమ, అభిమానాన్ని గుర్తుచేసుకునే సమ్మేళనమని స్పష్టం చేశారు. అంతకుముందు వైఎస్‌ చిత్రపటం వద్ద విజయమ్మ, షర్మిల ఘనంగా నివాళులర్పించారు. 

తెలంగాణలో వైఎస్‌ పాలనే అసలైన నివాళి 
వైఎస్‌ బాటలోనే తాను నడుస్తానని, తెలంగాణ విషయంలో ఆయన కన్న కలలను నిజం చేసేందుకు తన జీవితం అంకితం చేస్తానని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో మళ్లీ రాజశేఖరరెడ్డి పాలన తీసుకు వస్తానని, అదే తాను నాన్నకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ‘నియంత పాలన పోవాలి. ప్రజల రాజ్యం రావాలి. రాజన్న రాజ్యం, సంక్షేమ పాలన మళ్లీ రావాలి’ అని అన్నారు. ‘వైఎస్‌ ప్రేమించిన తెలంగాణ ప్రజలకు పవిత్రమైన వైఎస్సార్‌ పుష్కరం రోజున మాట ఇస్తున్నాను.నాన్న ప్రేమించిన ఈ ప్రాంత ప్రజల కోసం నేను నిలబడతా, నేను కొట్లాడతా. వాళ్ల మేలు కోరుకుంటూ వారిని ప్రేమిస్తా, వారికి సేవచేస్తా’ అని ప్రకటించారు.

ఈ సందర్భంగా వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గుర్తు చేస్తుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ఎన్,రఘువీరారెడ్డి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జితేందర్‌రెడ్డి, గిరీష్‌సంఘీ, శాంతాబయోటెక్‌ ఎండీ డాక్టర్‌ వర ప్రసాద్‌రెడ్డి, సన్‌షైన్‌ ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ గురవారెడ్డి, కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ భాస్కరరావు,  డాక్టర్‌ కాసు ప్రసాద్‌రెడ్డి (మాక్స్‌విజన్‌), సీనియర్‌ జర్నలిస్టులు ఏబీకే ప్రసాద్, కె.శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, న్యాయ నిపుణుడు జంధ్యాలరవిశంకర్‌ ప్రసంగించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top