రామప్ప ఆలయానికి వెల్దుర్తపల్లి రాయి..!

Velthundhi Stone For Ramappa Temple - Sakshi

13వ శతాబ్దం నాటి రాతి క్వారీ గుర్తింపు

వెల్దుర్తపల్లిలో వెలుగుచూసిన 8 శతాబ్దాల కిందటి రాతి గనులు 

పలు ప్రముఖ ఆలయాలకు రాతిని తొలిచింది ఇక్కడే! 

ఇప్పటికీ చెక్కు చెదరని ఉలి గుర్తులు

సాక్షి, హైదరాబాద్‌ : నీటిలో తేలియాడే ఇటుకలా..? అదీ ఎనిమిది శతాబ్దాల క్రితమా..? యునెస్కో ప్రతినిధులు నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతూ అడిగిన ప్రశ్నలు. ప్రపంచ వారసత్వ హోదాకు ఈ నిర్మాణం అర్హమైందా కాదా అని తేల్చే కసరత్తులో భాగంగా యునెస్కో ప్రతినిధులు రామప్ప నిర్మాణం గురించి తెలుసుకునే క్రమంలో ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ఇటుకలను తామెక్కడా చూడలేదని పారిస్‌లో జరిగిన సమావేశంలో ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తేలియాడే ఇటుకలను శిఖర నిర్మాణంలో పుణికిపుచ్చుకున్న రామప్ప మందిరం.. మెరిసే నల్లరాతితో కొంత, అబ్బురపరిచే ఎర్ర ఇసుకరాతితో సింహభాగం నిర్మితమైంది. సూదిమొన దూరేంతటి సందులు, విస్తుగొలిపే నగిషీలతో ఆ రాళ్లు అద్భుత కళాకృతులుగా ఆ మందిరంలో ఒదిగిపోయాయి. యునెస్కో గుర్తింపు వస్తే ప్రపంచ పర్యాటకులనూ మంత్రముగ్ధులను చేయగల సత్తా ఉన్న రామప్ప ఆలయానికి మనోహర రూపును తెచ్చి ఆశ్చర్యపరిచే ఆకృతి అద్దుకున్న ఆ రాళ్లు ఎక్కడివి? ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ఆ వివరాలు నమోదు కాలేదు. తొలిసారి ఆ రాతి జాడ తెలిసింది.

మూడు కిలోమీటర్ల దూరం.. 10 వేల టన్నుల రాళ్లు.. 
రామప్పతోపాటు అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపురం కోటగుళ్లు, రామానుజాపురం పంచకూటాలయాలు కూడా ఎరుపు ఇసుకరాతితో రూపుదిద్దుకున్నాయి. క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప దేవాలయం ద్వారాలు, స్తంభాలు, దూలాలకు డోలరైట్‌ నల్లరాతిని వినియోగించారు. మిగతా నిర్మాణమంతా ఎరుపు ఇసుకరాతితో సాగింది. నల్లరాతిని ఓరుగల్లు సమీప ప్రాంతాల నుంచి తేగా.. ఎర్ర రాతిని మాత్రం అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామానుజపురం–వెల్దుర్తపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెంచు కాలనీ(గుంటూరుపల్లి ) సమీపంలో ఉన్న గుట్టల నుంచి తొలిచినట్టు తాజాగా గుర్తించారు. అప్పుడు రాళ్లను తొలిచేందుకు వినియోగించిన పనిముట్ల గుర్తులు, వాటిని తయారు చేసిన కొలిమిలు, తయారైన పనిముట్లు నిల్వ చేసే ఏర్పాటు ఇప్పటికీ ఆ గుట్టలపై కనిపిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ విశ్రాంత అధికారి, విజయవాడ, అమరావతి కల్చరల్‌ సెంటర్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, ఔత్సాహిక చరిత్ర అన్వేషకుడు అరవింద్‌ శనివారం ఆయా గుట్టల వద్ద జరిపిన పరిశీలనలో వీటిని గుర్తించారు. ఇక్కడ రెండు గుట్టల నుంచి ఈ రాళ్లను సేకరించారు. ఈ రెండు గుట్టల నుంచి దాదాపు పది వేల టన్నుల రాతిని తొలిచినట్టు భావిస్తున్నామని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. తొలుత అవసరమైన ముడిరాతిని గుట్టపై భాగాన తొలిచి దిగువన దానికి కావాల్సిన ఆకృతి ఇచ్చి దేవాలయం వద్దకు తరలించి అక్కడ పూర్తి రూపు ఇచ్చేలా ప్రణాళికను అనుసరించారన్నారు. గుట్టపై భాగంలో కావాల్సిన రాతిని విడదీయటానికి వాడిన గూటం (సమ్మెటతో కొట్టే పరికరం)తో చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

దిగువన ఆ రాతి చిన్నచిన్న ముక్కలున్నాయి. పది ఎకరాల్లో రామప్ప ఆలయం, కల్యాణమండపం, త్రికూటాలయాలు రెండు, రామప్ప చెరువు కట్ట వద్ద ఎనిమిది అనుబంధ దేవాలయాలు, రామానుజాపురం పంచకూటాలయం, రెండంతస్తుల కల్యాణ మండపం, గణపురంలో 26 దేవాలయాల సమూహం, కల్యాణమండపాలకు ఈ రాతినే వాడారు. ఒక్క రామప్ప దేవాలయానికే దాదాపు 3,500 టన్నుల ఎర్ర ఇసుకరాయి, 1,500 టన్నుల నల్లరాయి వాడినట్టు అంచనా. ఇక గణపురం దేవాలయాలకు మరో 3,000 టన్నులు వాడారు. ఇలా అన్నీ కలిపి దాదాపు 10 వేల టన్నులు వాడి ఉంటారని అంచనా.

వందల మంది శిల్పులు.. 
ఈ అద్భుత నిర్మాణాలకు వందల మంది శిల్పులు పనిచేసేవారని, వారికి సహాయంగా మరికొంతమంది సిబ్బంది ఉండేవారని నాగిరెడ్డి తెలిపారు. ఆ రోజు పని పూర్తికాగానే ఉలులు, గూటాలను అక్కడే పడేస్తే ఇతర సిబ్బంది వాటిని సేకరించి మళ్లీ కొలిమి వద్దకు తీసుకెళ్లి, సరిచేసి అక్కడ పేర్చేవారని వివరించారు. మళ్లీ వాటిని మరుసటి రోజు శిల్పులు వినియోగించేవారని, ఈ ఆనవాళ్లన్నీ గుట్టలపై ఉన్నాయని వెల్లడించారు. వీటిని కాపాడి భావితరాలకు చూపించాల్సిన అవసరం ఉం దని నాగిరెడ్డి, అరవింద్‌ అభిప్రాయపడ్డారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top