ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి.. | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి..

Published Tue, Jan 9 2024 6:20 AM

Uttam Kumar Reddy urges millers to complete supply of CMR paddy to FCI by Jan 31 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కస్టమ్‌ మిల్లింగ్‌పై దృష్టి సారించాలని, రైస్‌ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్‌సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు.

తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 31వ తేదీలోపు బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఇతర అధికారులతో కలిసి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

42 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి..
ఈనెలాఖరు నాటికి 7.83 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం, యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరగకూడ దని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. మిల్లర్లంతా రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీ చేయడంపైనే ఆధారపడి ఉంటుందని, జాప్యం జరిగితే కార్పొరేష న్‌కు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందన్నారు. గత పదేళ్లలో రూ.58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వల్ల పౌరసరఫరాలపై భారం పడింద ని ఉత్తమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడుతోందన్నారు.

బియ్యం సరఫరాలో జాప్యంతో రాష్ట్ర కేటాయింపులపై ప్రభావం
సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో జాప్యం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు వస్తాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల కార్పొరేషన్‌ భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు.

పీడీఎస్‌ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్‌ బియ్యాన్ని పాలిష్‌చేసి రీసైక్లింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో బియ్యం బస్తాకు 45 కిలోల కంటే తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్‌ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల రేషన్‌షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాలనీ, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఆ కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాంః సీఎస్‌
సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎఫ్‌సీఐకి పంపిణీ చేయాల్సిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీని ఆధార్, రేషన్‌ కార్డుల్లోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement