
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికాలో బిగ్ షాక్ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా ప్రభుత్వం తోసి పుచ్చింది. దీంతో, తెలంగాణ పోలీసులు.. అమెరికా నుంచి ప్రభాకర్ రావుని డిపోర్టు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత సంవత్సరం నవంబర్ 29న తనపై రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టిందని.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన ఇచ్చిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అక్కడి ప్రభుత్వం ప్రభాకర్ రావును అభ్యర్థనను తోసిపుచ్చింది. తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోమని తేల్చి చెప్పింది. దీంతో, ఆయన అమెరికాను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా.. ఇంటర్‌పోల్ గత మార్చి 10న జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ముమ్మరం చేసింది. అయితే, ప్రభాకర్ రావును భారత్‌కు పంపించేందుకు యూఎస్ హోమ్‌ల్యాండ్ అనే సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ పూర్తి బాధ్యతలు తీసుకున్నట్లుగా సమాచారం. ప్రభాకర్‌ను ఎలాగైనా తెలంగాణకు తీసుకురావాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వచ్చే నెల 20న విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరు కాని పక్షంలో ప్రకటిత నేరస్థుడిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్టుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.