కరెంట్‌ కోతలు.. మళ్లీ మొదలు?

Unauthorized Power Cuts In Telangana And Farmers Against Protest - Sakshi

పల్లెల్లో అనధికార విద్యుత్‌ కోతలు.. రోడ్డెక్కుతున్న రైతులు 

మూడ్రోజులుగా సబ్‌ స్టేషన్ల ఎదుట మెదక్‌ జిల్లా రైతుల ధర్నా  

ఎండలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పైపైకి 

నిరంతర సరఫరా కోసం ఎక్కువ ధరకు ఎక్ఛేంజీల నుంచి కరెంటు కొంటున్న రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. పల్లెల్లో అనధికార విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని కొన్ని రోజులుగా రైతన్న లు రోడ్డెక్కుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్‌ జిల్లా రైతులు సబ్‌ స్టేషన్ల ఎదుట ధర్నా చేశారు. మహబూబ్‌నగర్‌ రైతులు కూడా కోతలు పెడుతున్నారని చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అటు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ మాత్రం కోతలేం లేవని, సాంకేతిక కారణాలతో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఎండలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మంగళవారం ఉదయం 12.20 గంటలకు 14,160 మెగావాట్ల గరిష్ట విద్యు త్‌ డిమాండ్‌ నమోదైంది. డిమాండ్‌ పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి పవర్‌ ఎక్ఛేంజీల నుంచి రాష్ట్రం ఎక్కువ ధర పెట్టి విద్యుత్‌ కొంటోంది.  

సబ్‌ స్టేషన్ల ఎదుట రైతుల ధర్నా 
రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావుల కింద సాగు చేస్తున్న యాసంగి పంటలు మరో 15 రోజుల్లో చేతికొచ్చే అవకాశముంది. ఈ సమయంలో అనధికారికంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్‌ జిల్లాలో రామాయంపేట, నిజాంపేట, శివంపేట సబ్‌ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేశారు. ఉదయం 7.15 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేసి తర్వాత సింగిల్‌ ఫేజ్‌ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యవసాయ విద్యుత్‌కు కోతలు విధిస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులేమో సాంకేతిక కారణాలతో మూడ్రోజులు దాదాపు 14 గంటలు విద్యుత్‌ కోతలు పెట్టామని చెప్పారు.  

డిమాండ్‌ పెరుగుతుండటంతో.. 
రోజూ ఉదయం 7.45–8.45 గంటల మధ్య వ్యవసాయ విద్యుత్‌ వినియోగం భారీగా ఉంటోంది. ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గుతున్నా గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వినియోగం పెరుగుతోంది. రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో బోర్లు వేస్తుండటంతో సాయంత్రం 6–7.30 మధ్య కూడా డిమాండ్‌ పెరుగుతోంది.

డిమాండ్‌ నిర్వహణలో భాగంగా సాయంత్రం 5 నుంచి ఉదయం 7 గంటల వరకు పల్లెల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను ఆపేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో విద్యుత్‌ను వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

విద్యుత్‌ ధరల భగభగ 
విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలూ పవర్‌ ఎక్ఛేంజీలపై అధారపడాల్సి వస్తోంది. యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 చొప్పున ఎక్ఛేంజీలు విక్రయిస్తున్నాయి. ఒక దశలో యూనిట్‌కు రూ. 20 వరకూ ధరలు పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో పేలుడు పదార్థాల కొరత ఏర్పడి దేశంలోని విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా తగ్గి విద్యుత్‌ ధరలు పెరుగుతున్నాయి.

రాష్ట్రం రోజుకు సగటున 50 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను కొంటోంది. సోమవారం సగటున యూనిట్‌కు రూ.14.52 ధరతో 40 ఎంయూల విద్యుత్‌ను కొన్నది. ఇందులో 6.5 ఎంయూల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేసింది. ఈ నెల 25న రాష్ట్రం 58 ఎంయూల విద్యుత్‌ను కొని ఒక్కరోజే రూ.100 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.  

విద్యుత్‌ కోతల్లేవు 
డిమాండ్‌ పెరిగినా విద్యుత్‌ కోతలు విధించట్లేదు. 132 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ ఇన్సులేటర్‌ కాలిపోవడంతోనే మెదక్‌ జిల్లాలో ఓ రోజు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.  డిమాండ్‌ కు తగ్గట్టు నిరంతర సరఫరా కొనసాగించడానికి పవర్‌ ఎక్ఛేంజీల నుంచి ఎక్కువ ధర పెట్టి విద్యుత్‌ కొంటున్నాం. 17,000 మెగావాట్లకు డిమాండ్‌ పెరిగినా సరఫరాకు సిద్ధంగా ఉన్నాం.    –ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు 

పెట్టుబడి చేతికందని పరిస్థితి 
24 గంటల విద్యుత్‌ వస్తుందనే ఆశతో ఉన్న కొద్దిపాటి ఎకరా భూమిలో వరి నాటు వేశా. విద్యుత్‌ కోతల వల్ల పంట ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. – ఆంజనేయులు, రైతు, చెండి, మెదక్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top