వారి రూటే సపరేటు.. ప్రతి పనికీ ఓ రేటు

TSSPDCL Has Become A  House Of Corruption - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్, కొత్త వెంచర్‌లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్‌ బోర్డు, కరెంట్‌ మీటర్‌....ఇలా ప్రతి పనికీ ఓ రేట్‌ ఫిక్స్‌ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంజనీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్‌ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో అవినీతి తిమింగళాలను వలపన్ని పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు ఏడాది తిరగక ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. నిజానికి ఏసీబీ కేసులున్న అధికారులను పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో వేయాలి. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం కొసమెరుపు. చదవండి: ప్రైవేటీకరణ మాటే లేదు

వారి రూటే సపరేటు..ప్రతి పనికీ ఓ రేటు
గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, వ్యక్తిగత గృహాలు అనేకం నిర్మాణం అవుతున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. చాలా మంది వినియోగదారులు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతుంటారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ వంటి నిబంధనలు పాటించరు. దీంతో వీటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వరు. ప్రభుత్వ, నోటరీ స్థలాల్లో నిర్మాణాలకు ఎలాంటి ధృవపత్రాలు ఉండవు. నిర్మాణంలో ఉన్న ఈ లోపాలను ఇంజనీర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. నిజానికి ఏదైనా వెంచర్‌కు కరెంట్‌లైన్‌ మంజూరు చేయాలంటే హెచ్‌ఎండీఏ అనుమతి ఉండాలి. కానీ ప్రస్తుతం శివారు ప్రాంతాల్లోని వెంచర్లలో చాలా వాటికి అనుమతి లేదు. అప్పట్లో గ్రామ పంచాయితీ అనుమతితో ఆయా వెంచర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటికి లైన్లు మంజూరు కోసం రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా హెచ్‌ఎండీఏ వెంచర్‌ నిర్వాహకులు కూడా రూ.లక్షకు పైగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక శివార్లలో కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్‌కు ప్యానల్‌బోర్డు, ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేయాలంటే సదరు యజమాని కనీసం రూ.లక్షన్నరపైగా కప్పం కట్టాల్సిందే. చదవండి: కరెంట్‌ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!

ఏసీబీని ఆశ్రయిస్తుండటంతో..
శివారు ప్రాంతాల్లోని కీసర, మేడ్చల్, హబ్సీగూడ, సైనిక్‌పురి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, చంపాపేట్, హబ్సీగూడ, డివిజన్లు అవినీతికి నిలయంగా మారాయి. ఇక్కడ పని చేస్తున్న కొంత మంది ఉన్నతాధికారులు కిందిస్థాయిలో పని చేస్తున్న సిబ్బందిని ఏజెంట్లుగా పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేన్నారు. నిజానికి భవనం, వెంచర్‌ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకుంటారు. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్‌ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్‌ఈకి వెళ్లుంది. వర్క్‌ఎస్టిమేషన్‌ దగ్గరి నుంచి మెటీరియల్‌ సరఫరా, వర్క్‌ పూర్తైన తర్వాత తనిఖీ చేసే వరకు సెక్షన్‌కు ఇంత అంటూ ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. లేదంటే రోజుల తరబడి తిరిగినా ఫైలు ముందుకు కదలదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top