సీనియర్‌ ఐఏఎస్‌లు ఇలా చేస్తే ఎలా?: మండిపడ్డ హైకోర్టు

TS High Court Dissatisfied With High Power Committee Of GO 111 Study - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీవో 111 పరిధిలోకి రాని ప్రాంతాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ నామమాత్రంగా మారిందని హైకోర్టు మండిపడింది. సంవత్సరాలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోని ఈ కమిటీని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులే ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ మండిపడింది.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ముందు దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్, వాటర్‌వర్క్స్‌ ఎండీ దానకిషోర్‌ల నేతృత్వంలో హైపర్‌ కమిటీని ఏర్పాటు చేశామని 2018లో చెప్పినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో 111ను సమర్ధవంతంగా అమలు చేయాలని, వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను జీవో 111 పరిధిలోకి పొరపాటుగా చేర్చారంటూ దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం మరోసారి విచారించింది. ఎన్‌జీటీ ఆదేశాల మేరకు హైపవర్‌ కమిటీ ఇప్పటికి 28 సార్లు సమావేశమైందని ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌ నివేదించగా  ‘ఎటువంటి నిర్ణయం తీసుకోలేనప్పుడు 100 సార్లు సమావేశమైతే ఏంటి?’ అంటూ ధర్మాసనం మండిపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి కమిటీ తీసుకున్న నిర్ణయాలతోపాటు కమిటీ సమావేశాలకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.

చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top