తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని సత్కరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు
ఒక మంత్రదండంలా తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు
బాధ్యతారహితంగా వ్యవహరించే కుమారులను దారిలో పెట్టాలన్నదే ఉద్దేశం
ఏ తల్లిదండ్రులూ అనాథలుగా ఉండకూడదు.. చివరి రోజుల్లో ఇబ్బంది పడకూడదు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తల్లిదండ్రులను చూసుకోని పిల్లలను సమాజం బహిష్కరించాలన్న సీఎం
బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభ
సాక్షి, హైదరాబాద్: ‘బాధ్యతా రహితంగా వ్యవహరించే కొడుకులను నియంత్రించడంతో పాటు తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకే సామాజిక బాధ్యతగా.. ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు’తీసుకువచ్చాం. తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక మంత్రదండం. తల్లిదండ్రులను చూసుకోని వారిని సమాజం బహిష్కరించాలి.
అలాంటి వారిని చట్టపరిధిలోకి తెచ్చి దారిలో పెట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.అయితే దీనితోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు.. వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూడదు, చివరిరోజుల్లో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బాధ్యత, భావోద్వేగంతో..
‘పురాణాలలో శ్రవణ కుమారుడి కథ మాతృ పితృ భక్తికి అద్దం పడితే..అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన రేమండ్స్ మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్‌పథ్ సింఘానియా చివరకు కొడుకు చేసిన ద్రోహంతో అనామకుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. పిల్లలకు సర్వస్వం ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ.. తన ఆత్మకథ ‘యాన్ ఇన్‌కంప్లీట్ లైఫ్’పుస్తకంలో సింఘానియా తన చేదు అనుభవాలను వివరించారు. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఇదే రకమైన ధోరణితో ఉన్నారు.
ఒక మాజీమంత్రి తండ్రి సైతం ఇదే విధంగా సరిగా చూసుకోని పరిస్థితుల్లో క్యాన్సర్‌తో చనిపోయారు. భవిష్యత్తులో తల్లిదండ్రులకు ఆ పరిస్థితి రావొద్దనే ప్రభుత్వం.. బాధ్యత, భావోద్వేగంతో ఈ బిల్లును తీసుకువచ్చింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లిదండ్రులను సంతానంలో ఎవరో ఒకరు చూసుకునేవారు. కానీ ఇప్పుడు మేం ఇద్దరం మాకు ఒక్కరన్న పరిస్థితి వచ్చింది.
వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ
మనిషి బంధాలు, అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయాడు. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదకరం. తల్లిదండ్రులపై ఒకవేళ కూతురికి ప్రేమ ఉన్నా పెళ్లి తర్వాత వారిని చూసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులను కాపాడేలా ఎన్నో చట్టాలు ఉన్నాయి.
పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యత అని చెబుతూ ఇప్పటికే చట్టాలున్నా సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతోన్న వివక్ష, నిర్లక్ష్యం గమనిస్తూనే ఉన్నాం. ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన ఈ బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చాం. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘అమ్మా.. నీకు వందనం’
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈ బిల్లు పెట్టాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సమాజం మారాలని, విలువలు పెరగాలని ఆకాంక్షించారు. కన్నబిడ్డలు నిర్ల క్ష్యం చేసిన ఓ ముస్లిం మహిళను తాను చేరదీసి అనాథా శ్రమంలో చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎంతో మానవత్వంతో ఆలోచించి ఈ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ‘అమ్మా.. నీకు వందనమే..’అనే పాట ఎమ్మెల్యే పాడారు.
గతంలో కుటుంబ అనుబంధాలు చాటిచెప్పే సినిమాలు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భయపెట్టే స్థితిలో కొందరు కొడుకులు, కోడళ్లు ఉన్నారన్నారు. బిల్లుకు ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, జాఫర్ హుస్సేన్ మద్దతు తెలిపారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.


