
తగ్గిపోతున్నప్రధాన సంప్రదాయ పంటలు
సోయాబీన్ మినహా పలు నూనె గింజల పంటలు దాదాపు కనుమరుగు
పాలమూరు, నిజామాబాద్ జిల్లాల్లో సైతం కానరాని వేరుశనగ
పప్పు దినుసు పంటలదీ అదే దారి.. కంది ఓకే.. పెసర, మినుములు అంతంతే..!
రాష్ట్రంలో వరి, పత్తిదే హవా
సాక్షి, హైదరాబా ద్: తెలంగాణలో ప్రధాన సంప్రదాయ పంటల సాగు తగ్గిపోతోంది. సోయాబీన్ మినహా పలు నూనె గింజల పంటల సాగు తగ్గుతుండగా కొన్ని దాదాపు కనుమరుగై పోతున్నాయి. వేరుశనగ, నువ్వులు, ఆముదం, ఆవాలు, సన్‌ఫ్లవర్, కుసుమ, వెర్రి నువ్వులు నామమాత్రంగానే సాగవుతున్నాయి. మరోవైపు పప్పు దినుసులదీ అదే పరిస్థితి కావడం గమనార్హం. రాష్టంలో ప్రతి ఏటా రైతులు కొన్ని పంటలనే సాగు చేస్తుండడం, సంప్రదాయ పంటలు కనుమరుగవుతుండడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పంటల మారి్పడి జరపాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు. సులభంగా సాగు చేసే పంటల వైపే మొగ్గు చూపుతున్నారు.
నువ్వులు, కుసుమ, ఆవాలు ఏవీ?
సోయాబీన్ మినహా సంప్రదాయ వేరుశనగ, నువ్వులు, ఆముదం, ఆవాలు, సన్‌ఫ్లవర్ వంటి పంటలన్నీ కలిపినా 2 వేల ఎకరాల్లో కూడా లేకపోవడం రాష్ట్రంలో పంటల సాగు తీరును తేటతెల్లం చేస్తుంది. ఆవాలు, కుసుమ, వెర్రి నువ్వులు మొదలైన నూనె పంటలు ఏకంగా 1.12 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే కేవలం 57 ఎకరాల్లో మాత్రమే ఈ పంటలు సాగయ్యాయి.
అంతంత మాత్రంగానే ఉలవలు, బొబ్బర్లు
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 7.92 లక్షల ఎకరాల్లో పప్పుదినుసు పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు సాగైంది కేవలం 4.86 లక్షల ఎకరాలే. అయితే అందులో కేవలం కంది, పెసర పంటలదే 60 శాతం వాటా. వాటి తరువాత స్థానంలో మినుములు ఉన్నాయి. అయితే ఈ పంటల విస్తీర్ణం తీసుకుంటే కంది పంట ఒక్కటే 4.21 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే దాదాపు 2.23 లక్షల ఎకరాలు లోటు సాగుగా చెప్పుకోవచ్చు. పెసర పంట 86 వేల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను కష్టంగా 50 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక మినుములు 15 వేల ఎకరాల్లో సాగవ్వగా, ఉలవలు 171 ఎకరాల్లో, బొబ్బర్లు, అనుములు 362 ఎకరాల్లో సాగయ్యాయి.
తగ్గుతున్న వేరుశనగ వైభవం
వేరుశనగ పంటకు పదేళ్ల క్రితం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రసిద్ధి. ఈ ప్రాంతంతో పాటు నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా కొన్ని మండలాల్లో వేరుశనగ పంటను సాగు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్రంలో ఈసారి ఇప్పటివరకు 1,227 ఎకరాల్లో మాత్రమే వేరుశనగ సాగవడం గమనార్హం. వేరుశనగతో పాటు నూనె గింజల పంటలు రాష్ట్రంలో దాదాపుగా కనుమరుగయ్యాయి. నూనె పంటల కేటగిరీలో సోయాబీన్ ఒక్కటే రాష్ట్రంలో అత్యధికంగా 3.49 లక్షల ఎకరాల్లో సాగవుతోంది.
సోయాబీన్ పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌లతో పాటు సంగారెడ్డి జిల్లాకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఇతర జిల్లాల్లో దాని ఆనవాళ్లు కూడా లేవు. రాష్ట్రం మొత్తం మీద నూనె గింజల పంటలు 3.51 లక్షల ఎకరాల్లో సాగువుతుంటే, అందులో సోయాబీన్ ఒక్కటే 3.49 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ వానాకాలం సీజన్‌లో నూనె పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.69 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అటు ఇటుగా అందులో సగం విస్తీర్ణంలో సోయాబీన్ పంట ఒక్కటే సాగవడం గమనార్హం.
సంప్రదాయ పంటలను మింగేస్తున్న వరి, పత్తి
దశాబ్ద కాలం క్రితం వరకు సంప్రదాయ పంటలకు నిలయమైన తెలంగాణ పల్లెలు ఇప్పుడు కేవలం వరి, పత్తి పంటలకే నిలయంగా మారాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో అత్యధికంగా వరి 60 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే పరిస్థితి ఉండగా, ఇప్పటికే 20 లక్షల ఎకరాలు దాటింది. పత్తి ఈ సంవత్సరం 50 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటికే 43 లక్షల ఎకరాలు దాటింది.
సాగునీటి సదుపాయం పెరగడంతో మిశ్రమ పంటలు సాగు చేసే ఉమ్మడి మహబూబ్‌నగర్ , మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు వరి సాగువైపు ఆకర్షితులయ్యారు. సాగునీటి సదుపాయం లేని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో లాభదాయకమనే ఉద్దేశంతో అధిక శాతం పత్తి పంటను సాగు చేస్తున్నారు. అలాగే డిమాండ్ ఎక్కువగా ఉండే సోయాబీన్, కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో పత్తి, వరితో పాటు మొక్కజొన్న, కంది పంటలు కలిపి ఏకంగా కోటి ఎకరాల్లో సాగవుతుండడంతో ప్రధాన సంప్రదాయ పంటలు తగ్గిపోతున్నాయి.