Telangana CS: తెలంగాణ సీఎస్‌ రేసులో ముగ్గురు?

Three Officers In Telangana Chief Secretary Position Race - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పు చెప్పగా, ఆ వెంటనే ఆయన్ను తెలంగాణ కేడర్‌ నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కేంద్రం సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించింది. దీంతో తక్షణమే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేశ్‌ కుమార్‌ సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్‌ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.           

సీనియారిటీతో సంబంధం లేకుండా.. 
కొత్త సీఎస్‌ రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తే సీఎస్‌ రేసులో 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ వసుధ మిశ్రా ముందంజలో ఉంటారు. అయితే, డెప్యూటేషన్‌పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండటం, మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేనట్టే. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని (1988 బ్యాచ్‌)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, 1990 బ్యాచ్‌ అధికారులైన శశాంక్‌ గోయల్‌ (ప్రస్తుతం డెప్యూటేషన్‌పై కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, 1991 బ్యాచ్‌ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ పేర్లను పరిశీలించాల్సి ఉండనుంది.

సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అధికారులను సీఎస్‌గా నియమించుకునే సంప్రదాయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదర్ఘీకాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు పనితీరు పట్ల సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న అరవింద్‌ కుమార్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పెషల్‌ సీఎస్‌లుగా ఉన్న శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. 

ప్రస్తుతానికి ఇన్‌చార్జి సీఎస్‌ నియామకం? 
పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలా? లేదా ఇన్‌చార్జి సీఎస్‌ను నియమించాలా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే మళ్లీ ఆయన్నే సీఎస్‌గా పునరి్నయమించే అవకాశముంది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరిస్తే మాత్రం పూర్తిస్థాయి సీఎస్‌ను నియమించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అలాంటి పరిస్థితుల్లో స్టేపై సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని ఇన్‌చార్జి సీఎస్‌గా నియమించవచ్చని తెలుస్తోంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top