పదవ తరగతి ఫలితాలను విడుదల చేస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్
పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
బాలుర కంటే 2.19% అధికంగా ఉత్తీర్ణులైన బాలికలు
పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు 5.26 లక్షలు
ఉత్తీర్ణులైన వారు 4.91 లక్షలు
ఉత్తీర్ణత శాతం 95.15%
గతేడాదితో పోలిస్తే 2.37% అధిక ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో అమ్మాయిలు అదరహో అనిపించారు. బాలుర కంటే బాలికలు 2.19 శాతం అధికంగా ఫలితాలు సాధించారు. బుధవారం టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఇ.నవీన్ నికోలస్, విద్యాశాఖ అదనపు సంచాలకుడు పీవీ శ్రీహరి, జి.రమేశ్ తదితరులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌సీఈఆర్‌టీ క్యాంపస్‌లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగాయి. సీబీఎస్‌ఈ టైమ్‌టేబుల్ మోడల్‌లో ఈసారి పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు, పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల విరామం ఉండేలా నిర్వహించడంతో పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు విద్యార్థులకు ఎంతగానో దోహదపడింది. దీంతో ఉత్తీర్ణత కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 5,16,815 మంది రెగ్యులర్ విద్యార్థులు, 9,351 మంది వన్‌టైమ్ ఫెయిలైన విద్యార్థులున్నారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల్లో 4,97,312 మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో 4,91,774 మంది రెగ్యులర్, 5,538 మంది వన్‌టైమ్ ఫెయిల్ విద్యార్థులున్నారు. రెగ్యులర్ కేటగిరీలో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 2.37 శాతం పెరిగింది. తాజా ఫలితాల్లో బాలికలు 96.26 శాతం మంది, బాలురు 94.07 శాతం ఉత్తీర్ణులయ్యారు. 
జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థులు ఆందోళన చెందొద్దని విద్యాశాఖ సూచించింది. జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పీవీ శ్రీహరి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాయాలనుకుంటే మే 14 కల్లా ఫీజును సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలి. హెడ్‌మాస్టర్లు ఇ–ఎన్‌ఆర్‌లను డీఈఓకు మే 15లోగా సమరి్పస్తారు. డీఈఓలు ఇ–ఎన్‌ఆర్‌లను మే 16లోగా ప్రభుత్వ పరీక్షల విభాగానికి అందజేయాలి. రూ.50 ఆలస్య రుసుముతో పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. 

ములుగు ఫస్ట్... హైదరాబాద్ లాస్ట్
2026 టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్‌లో నిలిచింది. 99.30 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలబడగా... అట్టడుగు స్థానంలో హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో ఉండిపోయింది. టెన్త్ ఫలితాలను విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు. రానున్న 15 రోజులు ఈ ఫలితాలు అందు బాటులో ఉంటాయి. జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 30 నుంచి మే 14 వరకు https://bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్కుల రీకౌంటింగ్ కోసం రూ.500 ఫీజు, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.


