‘న్యూఇయర్‌’ దర్శనాలకు  యాదాద్రి సిద్ధం.. భక్తుల రాకకు తగ్గట్టుగా ఏర్పాట్లు

Telangana Yadadri Temple Ready For New Year Darshan - Sakshi

యాదగిరిగుట్ట: నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంతోపాటు పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. వేకువజామున 3 గంటలకే ఆలయాన్ని తెరవనున్నారు. వేకువజామున 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం మొదలు రాత్రి 9:45 గంటల నుంచి 10 గంటల వరకు శయనోత్సవం వరకు నిత్య పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం ద్వారబంధనం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, 10 గంటల నుంచి 11:30 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరపనున్నారు. అనుబం«ధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆదివారం ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 8:45 గంటల వరకు భక్తులకు దర్శనాలు కలి్పంచనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈవో గీతారెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రిలోని ఆలయ పరిసరాలు, క్యూలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేశాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 

భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం..
ఆలయానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా లడ్డూ, పులిహోర ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్లను ఉదయం 5 గంటలకే తెరిచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. 

స్వర్ణ తాపడం కోసం రూ. 33 కోట్ల నగదు,8 కిలోల బంగారం విరాళాలు.. 
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం ఇప్పటివరకు దాతల ద్వారా రూ. 33 కోట్ల నగదు, 8 కిలోల బంగారం వచి్చందని ఈవో గీతారెడ్డి తెలిపారు. ప్రధానాలయం ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్‌ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించారు. ఇందుకు దాతలు విరివిగా విరాళాలు ఇచ్చారు. మరింత బంగారం, నగదు విరాళం రూపంలో వస్తుందని చెప్పారు. ప్రస్తుతం విమాన గోపురానికి అవసరమైన పనులు జరుగుతున్నాయని, రెండు నెలల్లో ఈ పనులు పూర్తి కాగానే బంగారు తాపడం పనులు ప్రారంభిస్తామన్నారు.
చదవండి: TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top