దేశంలో సాగు చేసిన ఆయిల్ పామ్ విస్తీర్ణంలో 36 శాతం తెలంగాణదే
జాతీయ సదస్సు-2026లో వెల్లడి
రైతుల కృషి, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-హైదరాబాద్,: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు–2026లో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని వెల్లడించగా, తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు స్పష్టమైందన్నారు.
NMEO-OP మిషన్ కింద 2021 నుండి 2026 వరకు దేశవ్యాప్తంగా 2,73,084 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, అందులో 98,112 హెక్టార్లతో తెలంగాణ ఒక్కటే 36 శాతం వాటాను కలిగి ఉండటం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుండగా, 79,448 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు.
మంంత్రి మాట్లాడుతూ... ఈ విజయం కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను స్వీకరిస్తూ ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు విశేషంగా తోడ్పడుతున్నారని చెప్పారు.
దేశంలో ఎడిబుల్ ఆయిల్స్ అవసరం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుందని మంత్రి తెలిపారు. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాలపాటు దిగుబడి అందే ఈ పంట ద్వారా రైతులు ఎకరాకు సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.
ఆయిల్ పామ్ రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్‌లు (FFBs) ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేయబడుతున్నాయని, దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.23,501గా ఉండటం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారిందన్నారు.
అయితే, గతంలో అమలులో ఉన్న విధంగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై 44 శాతం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.25,000 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రైతులకు మరింత అధిక ఆదాయం లభించడంతో పాటు, కొత్తగా ఎక్కువ మంది రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెరగడం, రైతుల ఆదాయం మెరుగుపడడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని మంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. రైతులకు నాణ్యమైన మొక్కల సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీ, మొదటి నాలుగు సంవత్సరాలపాటు తోటల నిర్వహణకు ఆర్థిక సహాయం, అంతర పంటల సాగుకు ప్రోత్సాహకాలు, కోత పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.51 వేల వరకు రాయితీ అందిస్తున్నామని తెలిపారు. అదనంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పలు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలన్నీ రైతుల పెట్టుబడి భారం తగ్గించి, ఆయిల్ పామ్ సాగుపై విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన ప్రాసెసింగ్ మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి గంటకు ప్రాసెసింగ్ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. అదనంగా మరో ఏడు ప్రాసెసింగ్ మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత రైతులకు మరింత సమీపంలోనే ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఆయిల్ పామ్ రంగం కేవలం రైతుల ఆదాయాన్నే పెంచడం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రాసెసింగ్ మిల్లులు, రవాణా, కోత, నిల్వ, అనుబంధ కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ రంగం దోహదపడుతోందన్నారు.
పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, దేశంలో వంటనూనెల స్వయం సమృద్ధి సాధించడం, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
"తెలంగాణ రైతన్న కృషి, పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి వచ్చిన ఫలితమే ఈ అగ్రస్థానం. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1గా నిలవడం ప్రతి రైతుకు గర్వకారణం. రైతుల సంక్షేమం, ఆదాయ వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది" అని స్పష్టం చేశారు.


