రైతు వెంటే తెలంగాణ రాష్ట్రం

Telangana State Stages Bharat Bandh - Sakshi

రైతు వెంటే రాష్ట్రం

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రాష్ట్రంలో రోడ్డెక్కిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు

సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వేలాదిగా పాల్గొన్న ప్రజలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

జాతీయ రహదారుల దిగ్బంధం.. 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ చెదురు మదురు ఘటనలు మినహా మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. దాదాపుగా అన్ని పార్టీలు రోడ్డెక్కి నిరసన తెలిపాయి. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు ధర్నాల్లో పాల్గొన్నారు. విపక్ష కాంగ్రెస్, ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించింది. వివిధ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు వాహనాలు రోడ్డెక్కలేదు.

రైల్వే సర్వీసులకు, ఆసుపత్రులు, పెట్రోల్‌ బంకులు తదితర అత్యవసర సర్వీసులకు బంద్‌ నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఎలాంటి ఆటంకం కలగలేదు. కొన్నిచోట్ల ధర్నాలు, వ్యవసాయ చట్టాల విషయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతలు చల్లారాయి. పలుచోట్ల వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. మరికొన్నిచోట్ల మాత్రం ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. మొత్తంమీద మంగళవారం రాష్ట్రంలో నిర్వహించిన భారత్‌ బంద్‌లో చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా «ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. మంత్రులంతా జాతీయ రహదారులను దిగ్బంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లాలవారీగా బంద్‌ 

ఎలా జరిగిందంటే...
హైదరాబాద్‌ పరిధిలో...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం భారత్‌ బంద్‌తో జనజీవనం స్తంభించింది. ప్రజారవాణా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూరప్రాంతాల నుంచి రైళ్లలో నగరానికి చేరుకున్న వారు ఇళ్లకు చేరుకోవడం కష్టంగా మారింది. ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాశారు. మంత్రి తలసాని సికింద్రాబాద్‌లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొనగా, ఆజంపురాలో హోంమంత్రి మహమూద్‌ అలీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

రంగారెడ్డిలో...
జిల్లాలోని షాద్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ ఆందోళనకు దిగారు. కేంద్రం కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసేలా కొత్త వ్యవసాయ చట్టాలు రూపొందించిందని దుయ్యబట్టారు. మద్దతు ధర అంశాన్ని చట్టంలో ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో తుక్కుగూడ వద్ద శ్రీశైలం హైవే వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు.

వరంగల్‌లో..
రైతు బిల్లులుకు వ్యతిరేకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మడికొండలో హైదరాబాద్‌ రహదారిపై ధర్నా చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. 

నల్లగొండ జిల్లాలో
హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వందలాది ట్రాక్టర్లతో సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. జనగాం ఎక్స్‌రోడ్డు వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, కేతెపల్లి మండలం కొర్ల పహాడ్‌ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాస్తారోకోలో పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు.

మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్‌నగర్‌లో జరిగిన నిరసనలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆలంపూర్‌ చెక్‌పోస్టు వద్ద ధర్నాలో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. షాద్‌నగర్‌  మార్కెట్‌ కమిటీ యార్డు వద్ద ఎంపీ రేవంత్‌ రెడ్డి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.

కరీంనగర్‌లో..
కరీంనగర్‌ శివారులోని అలుగునూరు వద్ద హైదరాబాద్‌ హైవేపై మంత్రి గంగుల కమలాకర్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు నిరసన తెలిపారు. ధర్మారం, చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చొప్పదండి వద్ద కాంగ్రెస్‌ నేత మేడిపల్లి సత్యం అనుచరులతో కలసి మంత్రి కొప్పులను అడ్డగించడంతో ఉద్రిక్తత తలెత్తింది. బస్టాండ్‌ వద్ద జరిగిన ధర్నాలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కోరుట్ల కార్గిల్‌ చౌరస్తాలో మొక్కజోన్నలకు మద్దతు ధర కల్పించాలని రైతులు ఆందోళనకు దిగారు.

మెదక్‌లో..
సన్న వడ్లు కొనాలంటూ ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. ముందు కేంద్రం జారీ చేసిన లెవీ సేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. హుస్నాబాద్, తుప్రాన్, గజ్వేల్‌లో జరిగిన రాస్తోరోకోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని నిరసన తెలిపారు.
ఆదిలాబాద్‌ జిల్లాలో..
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌ పట్టణంలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. జోగు రామన్న బోరాజ్‌ వద్ద జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా జిల్లా కేంద్రాలు, జాతీర రహదారులపై ధర్నాలు నిర్వహించారు.

నిజామాబాద్‌లో..
కామారెడ్డిలో 44వ జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ కవిత, విప్‌ గంప గోవర్దన్‌ రాస్తారోకోకు దిగారు. కేంద్రం మద్దతు ధర విషయాన్ని ప్రస్తావించక పోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి వేల్పుల ప్రశాంత్‌రెడ్డి 64వ జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో..
మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం పట్టణంలో రాస్తారోకోలో పాల్గొన్నారు. బూర్గంపాడు మండలం కారపాక పట్టణంలో జాతీయ రహదారి ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ధర్నాలో పాల్గొన్నారు.

పలుచోట్ల చెదురుమదురు ఘటనలు..
భారత్‌ బంద్‌కు అనుకూలంగా హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కొందరు అడ్డుకున్నారు. ఇంతకాలం రైతుల సమస్యలు పక్కనబెట్టి ఇప్పుడు ఆందోళనలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. బంద్‌పై నిలదీసిన ఓ వ్యక్తిని ఎమ్మెల్యే ఆగ్రహంతో నెట్టేడం వివాదాస్పదమైంది. మియాపూర్‌లో  ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు పెట్టడంతో వాటిని తొలగించాలని వాహనదారులు వాగ్వాదానికి దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడి హత్నూర్‌లో షాపులు తెరిచిన వారితో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ పూర్తిగా బంద్‌ పాటించింది. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులకు, వ్యాపారులకు వాగ్వాదం నడిచింది. ఆమనగల్లులో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ వర్గీయులు బాహాబాహీకి దిగారు. కర్రలు, నీళ్ల సీసాలు విసురుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top