సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ 89.23 శాతం ఉత్తీర్ణత నమోదయింది. నాగర్ కర్నూలు (99.03), నిర్మల్ (98.96), జగిత్యాల (98.87), మహబూబాబాద్ (98.81) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మొత్తం 99.15 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలురు 2,45,027 (94.04 శాతం), బాలికలు 2,46,747 (96.26 శాతం) మంది ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5,16,815 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 4,91,774 మంది విద్యార్థులు పాసయ్యారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 74,099 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 66,115 మంది ఉత్తీర్ణులయ్యారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 3,287 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,264 మంది పాసయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 52,946, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 48,855 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
(Telangana SSC Results 2026) ములుగు తర్వాత అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,541 మంది పిల్లలు టెన్త్ పరీక్షలు రాశారు. వీరిలో 3,483 మంది పాసయ్యారు. జనగాం జిల్లాలో 6,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు.
మంత్రి సీతక్క హర్షం
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం ప్రకటించారు. జిల్లా యంత్రంగానికి, విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
జిల్లాల వారీగా ఫలితాల వివరాలు



